సేతుపతి అందుకు ఒప్పుకుంటాడా?
బుల్లితెరపై వచ్చే రియాలిటీ షో అన్నింట్లో రారాజుగా నిలిచిన బిగ్ బాస్ ఇప్పుడు 8వ సీజన్ కు రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా దీనికి సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేశారు. మొదటి రెండు సీజన్లు ఎన్టీఆర్, నాని చేయగా తర్వాత నుంచి నాగార్జునే చేసుకుంటూ వస్తున్నారు. అయితే ఈ సీజన్ కు హోస్ట్ మారతాడని, బాలయ్య హోస్ట్ చేసే ఛాన్సుందన్నారు కానీ ఈసారి కూడా నాగార్జునే ఈ బాధ్యతను తీసుకున్నాడు.
తెలుగు బిగ్ బాస్ విషయంలో అంతా సవ్యంగా ఉందనుకునే టైమ్ లో తమిళ బిగ్ బాస్ కు ఇప్పుడో చిక్కొచ్చింది. ఈ షోకు హోస్ట్ గా ఉన్న కమల్ తాను హోస్ట్ చేయలేనంటూ బహిరంగ లేఖ ద్వారా తెలిపిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పుడు తమిళ బిగ్ బాస్ టీమ్ ప్రత్యామ్నాయం కోసం వెతుకుతుంది. ఇన్ సైడ్ టాక్ ప్రకారం కమల్ ను విజయ్ సేతుపతి రీప్లేస్ చేసే ఛాన్సులు ఎక్కువగా ఉన్నట్లు సమాచారం.
సింబును అనుకున్నప్పటికీ ఆయనకున్న కమిట్మెంట్స్ కారణంగా వీలు పడకపోవచ్చంటున్నారు. దీంతో మహారాజా బ్లాక్ బస్టర్ తో తన ఇమేజ్ ను పెంచుకున్న విజయ్ సేతుపతితో ముందుకెళ్లాలని తమిళ బిగ్ బాస్ యాజమాన్యం నిర్ణయించుకుందని టాక్. తెలుగు, తమిళ సీజన్లు ఒకేసారి స్టార్ట్ చేయాలని చూసినప్పటికీ అది కుదిరేలా లేదు. మరి ఈ షో హోస్టింగ్ కు విజయ్ సేతుపతి ఒప్పుకుంటాడో లేదో చూడాలి.













