శ్రీకారం చిత్రంపై ఉపరాష్ట్రపతి ప్రశంసలు
శర్వానంద్ కథానాయకుడిగా నటించిన చిత్రం శ్రీకారం. కిశోర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 11న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రియాంక్ అరుళ్ మోహన్ కథానాయిక. వ్యవసాయం ఇతివృత్తంగా తెరకెక్కిన శ్రీకారం చిత్ర బృందానికి ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేశారు. వ్యవసాయ పునర్వైభవం కోసం గ్రామాలకు మరలండి అనే స్ఫూర్తిని యువతలో రేకెత్తించే విధంగా తెరకెక్కించిన శ్రీకారం చక్కని చిత్రం. కుటుంబం, ఊరు అందరూ కలిసి ఉంటే సాధించలేనిది ఏదీ లేదనే చక్కని సందేశాన్ని అందించిన చిత్ర దర్శక నిర్మాతలు, నటీనటులకు శుభాకాంక్షలు అని పేర్కొన్నారు. 14 రీల్స్ పతాకంపై రూపొందిన ఈ చిత్రానికి రామ్ అచంట, గోపీ అచంట నిర్మాతలు. మిక్కీ జే.మేయర్ సంగీతం అందించారు.













