ఇదెక్కడి మాస్ వకీల్ సాబ్!
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వకీల్ సాబ్’. ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, బే వ్యూ ప్రాజెక్ట్స్ పతాకాలపై దిల్‌రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 9న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలకాబోతోంది. దాదాపు మూడు సంవత్సరాల తర్వాత పవన్ కల్యాణ్ చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటాయి. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. ఆయన సినిమాలు విడుదల సమయంలో ఫ్యాన్స్ చేసే హంగామా అంతాఇంతా కాదు. చాలా కాలం తర్వాత ఆయన నటించిన వకీల్ సాబ్ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.
తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. మరోవైపు ఈ సినిమాలో పవన్ కళ్యాన్ ఫస్ట్ టైమ్ వకీల్ సాబ్ పాత్రలో కనిపించనుండటంతో ఈ సినిమాలో లాయర్‌గా పవన్ కళ్యాణ్ నటన ఎలా ఉండబోతుందో అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయనడానికి తాజాగా విడుదలైన ట్రైలర్ సృష్టించిన, సృష్టిస్తోన్న ప్రభంజనమే సాక్ష్యం. వ్యూస్, లైక్స్ పరంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో సరికొత్త రికార్డులను, ఇంతకు ముందు టాలీవుడ్ ఇండస్ట్రీలో లేని రికార్డులను ఈ ట్రైలర్ క్రియేట్ చేసింది. 24 గంటల్లో ఈ ట్రైలర్ క్రియేట్ చేసిన రికార్డులను చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది.
ట్రైలర్ వేసిన ప్రతి థియేటర్ వద్ద.. అభిమానుల కోలాహలం ఎలా ఉందో ఇప్పటికే కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో హల చల్ చేస్తున్నాయి. కొన్ని చోట్ల థియేటర్ల అద్దాలు, గేట్లు కూడా బద్దలయ్యాయి. ఈ సినిమా ట్రైలర్‌కే అభిమానుల గోల ఇలా ఉంటే.. ఏప్రిల్ 9 న ఆ రచ్చ ఏ రేంజ్లో ఉంటుందో చూడాలి. వకీల్ సాబ్ సినిమాలో పవన్ సరసన శ్రుతిహాసన్ నటించింది. న్యాయవాదిగా ప్రకాశ్ రాజ్, కీలక పాత్రల్లో నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ల నటించారు.













