సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న దాడిపై ఫిర్యాదు చేసిన రియా.. స్పందించిన మహారాష్ట్ర మంత్రి
సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య చేసుకొని నెల దాటిపోతున్నా సోషల్ మీడియాలో ఆ ఘటన తాలూకు వేడి చల్లారడం లేదు. సుశాంత్ అభిమానుల ఆగడాలు ఆగడం లేదు. సుశాంత్ చనిపోయిన నాటి నుంచి అతని ప్రియురాలు రియా చక్రవర్తిని టార్గెట్ చేస్తూ కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. అది ఈమధ్యకాలంలో కాస్త ఎక్కువే అయింది. దాంతో రియా సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి.. సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న దాడికి సంబంధించిన వివరాలు అందించింది. ఈ విషయం తెలుసుకున్న ఒక వ్యక్తి రెచ్చిపోతూ `నువ్వు ఆత్మహత్య చేసుకొని చచ్చిపో.. లేదంటే రేప్ చేసి చంపేస్తాను` అంటూ బెదిరించాడు. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్లను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. వారిపై చర్యలు తీసుకోవాలంటూ సోషల్ మీడియా ద్వారానే ఫిర్యాదు చేసింది రియా.
అంతేకాకుండా కేంద్ర హోం శాఖామంత్రి అమిత్ షాకు కూడా సోషల్ మీడియా ద్వారానే ఫిర్యాదు చేసింది. తనపై జరుగుతున్న దాడి గురించి చెప్తూ.. సుశాంత్ కేసును సీబీఐకి అప్పగించాలని కోరింది. కానీ, ఈ ఫిర్యాదుపై కేంద్రం స్పందించలేదు. కానీ, మహారాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖామంత్రి ఆ ఫిర్యాదుపై స్పందిస్తూ తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ విషయం గురించి మహారాష్ట్ర హోం మంత్రితో మాట్లాడి ఆ సైబర్ నేరగాళ్ళపై అరెస్ట్ చేస్తామని ప్రకటించారు. ఈ క్రమంలో రియాను బెదిరించిన ఇద్దరు ఇన్స్టాగ్రామ్ యూజర్లను ముంబై పోలీసులు అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. అంతేకాదు ఆమెను రేప్ చేసి చంపేస్తానంటూ బెదిరించిన వ్యక్తి కోసం పోలీసులు అన్వేషిస్తున్నారు. త్వరలోనే ఆ వ్యక్తిని పట్టుకుంటామని ముంబై పోలీసులు చెబుతున్నారు.













