నేడే రాజనాల జయంతి❗
కావలి కీర్తిని ప్రపంచానికి చాటిన ఆంధ్రుల ఏకైక విలన్ రాజనాల
తెలుగు సినీరంగంలో తారాజువ్వలా వెలుగొంది – ఆంధ్రుల ఏకైక విలన్ గా కీర్తిని ఆర్జించిన మహానటుడు రాజనాల కల్లయ్య (రాజనాల కాళేశ్వరరావు నాయుడు) కావలీయుడు కావడం కావలి ప్రజల అదృష్టమనే చెప్పాలి. 03-01-1922 లో రాజనాల మోతుకుర్రు, కావలి దగ్గర జన్మించారు. రెవిన్యూ శాఖలో కొంతకాలం రెవిన్యూ ఇన్స్పెక్టర్ గా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించారు. తెలుగు సినీ రంగంలో ఎదురులేని ప్రతి నాయకుడిగా 4 దశాబ్దాలు విరాజిల్లారు.
నెల్లూరులో ఎఫ్ ఏ చదువుకునే రోజుల్లోనే 1948 లో తన స్నేహితుడు లక్ష్మీ కుమార్ రెడ్డి, రాజనాల కలిసి నేషనల్ ఆర్ట్ థియేటర్ స్థాపించారు. మనసుకవి ఆత్రేయ రాసిన “ఎవరు దొంగ” నాటకం రాజనాల ప్రదర్శించినందుకు – అప్పటి కలెక్టర్ రెవిన్యూ శాఖలో పనిచేస్తూ ఉద్యోగుల్ని అవినీతిపరులు అంటావా అంటూ మండి పడడం జరిగింది. అలాగే “ప్రగతి” నాటకం ప్రదర్శించి నందుకు రాజనాల ను కలెక్టర్ సస్పెండ్ చేశారు. అప్పటికే మద్రాసు తో పరిచయమున్న రాజనాల ఉద్యోగానికి స్వస్తి పలికి పూర్తిగా తెలుగు చలనచిత్ర రంగానికే అంకితమయ్యారు.
1951 లో హెచ్ ఎం రెడ్డి తో కాట్రాక్టు ఒప్పందం నెలకు 200 చొప్పున ఒప్పుకొని తొలిసినిమా “ప్రతిజ్ఞ” లో విలన్ పాత్ర వేసి తెలుగు ప్రేక్షకులను అలరించారు. అది 1953 లో విడుదల అయ్యింది. ఆతర్వాత “వద్దంటే డబ్బు” చిత్రంలో ఎన్ఠీఆర్ కు మామగా ముసలి పాత్రలో నటించి శెభాష్ అనిపించుకున్నారు. అక్కడనుండి ఆయన వెనుతిరిగి చూడలేదు. దాదాపు 3 దశాబ్దాలపాటు వివిధ పాత్రలు పోషించి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో పదిలంగా నిలిచిపోయారు. హాలీవుడ్ చిత్రం “మాయా ది మెగ్నీష్మెంట్” అనే చిత్రంలో నటించి అప్పట్లో హాలీవుడ్ చిత్రంలో నటించిన తొలి నటుడుగా చరిత్రకెక్కారు.
ఇక జీవిత విశేషాల్లోకి వస్తే 1979 లో భార్య మృతి చెందింది. 1984 లో కుమారుడు కులవర్ధన్ మూర్ఛ వ్యాధితో మరణించగా – మరో కుమారుడు కాళీ చరణ్ బొంబాయి వెళ్లి అక్కడ అదృశ్యమయ్యాడు. ఆ బాధలు జీర్ణించుకోలేకపోయిన రాజనాల 1991 లో స్నేహితుల సహకారంతో మద్రాసు విడిచి హైదరాబాద్ చేరారు. ఆమీర్ పేటలో రూబీ అపార్ట్మెంట్ లో చిన్న రూమ్ కొనుగోలు చేసుకొని అందులో రెండవ భార్యతో కాపురం పెట్టాడు. ఆతర్వాత అక్కడే కాలు ఇన్ఫెక్షన్ కు గురికావడంతో కాలు కూడా తీసేసారు. చేతికి వెన్నుముక లేని విధంగా దాన ధర్మాలు చేసిన రాజనాల – చివరి రోజుల్లో ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తెలుగు విలన్లలో రారాజుగా వెలుగొందిన రాజనాల కావలి శ్రీ కలుగోళ శాంభవి భక్తుడు. కావలి ఎప్పుడు వచ్చినా కలుగోళమ్మ ఆశీస్సులు అందుకోనిదే తిరిగి వెళ్ళేవాడు కాదు. కావలి పేరు నలుదిక్కులా చాటిన రాజనాల ఇంగ్లీషు, హిందీ, తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో నటించారు. తెలుగు చలనచిత్ర సీమలో అధిక పారితోషికం అప్పట్లో తీసుకుంటున్న ఎన్ఠీఆర్ తో సమానంగా రాజనాల పారితోషికం తీసుకునేవారు. ఇలా కావలి వున్నంతకాలం మరచిపోలేని మహానటుడు, తెలుగు చిత్రసీమ ఆణిముత్యం రాజనాల 21-05-1998 లో పరమపదించారు.
ఆయన పేరిట గత రెండేళ్ల క్రితం కావలిలో “రాజనాల కళాపీఠం” నెలకొల్పడం జరిగింది. ఈరొజు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని కావలి రెడ్ క్రాస్ బిల్డింగ్ లో పై సంస్థ పేదలకు కొన్ని కార్యక్రమాలు రూపొందించింది.
———————————————–
ప్రభాకర్ జలదంకి
సీనియర్ జర్నలిస్టు
స్వతంత్ర ప్రభ న్యూస్ సర్వీస్













