రాజమౌళి ఆర్ఆర్ఆర్ రిలీజ్ 2022 లోకి వెళ్లిందట?

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దిగ్దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో డి వి వి దానయ్య నిర్మిస్తున్న పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్. తొలిసారిగా ఈ ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తుండడం అలానే బాహుబలి సిరీస్ లోని రెండు సినిమాల భారీ సక్సెస్ ల తరువాత రాజమౌళి నుండి వస్తున్న మూవీ కావడంతో ఆర్ఆర్ఆర్ పై అందరిలోనూ ఆకాశమే హద్దుగా అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమురం భీం పాత్ర చేస్తుండగా చరణ్, అల్లూరి సీతారామరాజు గా కనిపించనున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య దాదాపుగా రూ.500 కోట్ల కు పైగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా పేట్రియాటిక్ ఫిక్సన్ డ్రామా నేపథ్యంలో పలు కమర్షియల్, ఎమోషల్ అంశాల కలబోతగా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాని అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకునేలా రాజమౌళి ఎంతో అద్భుతంగా తీస్తున్నారని అంటున్నారు. కీరవాణి మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకి సెంథిల్ కుమార్ ఫోటోగ్రఫి అందిస్తుండగా విజయేంద్ర ప్రసాద్ కథని అందిస్తున్నారు. అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో సముద్రఖని, అజయ్ దేవగన్, శ్రియ శరణ్ తదితరులు ఇతర పాత్రలు చేస్తున్నారు. కాగా ఈ మూవీని ఈ ఏడాది అక్టోబర్ 13న విడుదల చేస్తున్నట్లు ఇటీవల యూనిట్ ప్రకటించింది.
దేశంలో కరోనా ఉదృతి రోజురోజుకూ రెట్టింపవుతోంది. నిత్యం లక్షలాది కేసులు నమోదు కావడం, వేలల్లో కరోనా మరణాలు చోటు చేసుకోవడం ప్రతి ఒక్కరిలో గుబులు పుట్టిస్తోంది. కరోనా సెకండ్ వేవ్‌తో మరోసారి సినీ ఇండస్ట్రీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. మిగతా అన్ని రంగాలతో పాటు సినిమా రంగంపై కూడా మరొక్కసారి ఈ మహమ్మారి ప్రభావం పడింది. ఇప్పటికే ఎక్కడికక్కడ పలు సినిమాల షూటింగ్స్ అన్ని నిలిచిపోగా, కొన్ని థియేటర్ లు స్వచ్చందంగా మూసేసారు. మరి కొన్ని 50 అక్కుఫెన్సీ తో రన్ అవుతున్నాయి. మరోవైపు విడుదల కావలసిన పలు సినిమాలు సైతం కొన్నాళ్ళు పోస్ట్ పోన్ కబడ్డాయి. అయితే లేటెస్ట్ గా పలు ఫిలిం నగర్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ మహమ్మారి ప్రభావం తో అక్టోబర్ లో విడుదల కానున్న ఆర్ఆర్ఆర్ పై కూడా పడే ఛాన్స్ ఉందని, అందుకే ఆర్ఆర్ఆర్ ని 2022 జనవరి కి తీసుకెళ్తారని సమాచారం. కాగా ఈ విషయమై దర్శకుడు రాజమౌళి ఒక ఆలోచన చేసారని, దాని ప్రకారం తమ సినిమాని జనవరి 26న గణతంత్ర దినోత్సవం రోజున విడుదల చేస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదని, అంతకముందు సంక్రాంతికి రిలీజ్ షెడ్యూల్ చేసుకున్న సినిమాలు ఏవి ఇబ్బంది పడకుండా రాజమౌళి ఈ డేట్ ఫిక్స్ చేయాలని భావిస్తున్నట్లు చెప్తున్నారు. అయితే దీనిపై పూర్తి వాస్తవాలు అధికారికంగా ప్రకటన వస్తేనే కంఫర్మ్ అనుకోవాలి.