దుబాయ్ లో సందడిగా సైమా వేడుక
సైమా (సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్) 2018 వేడుకలో బాహుబలి ది కన్క్లూజన్కి పురస్కారాల పంట పండింది. ఉత్తమ చిత్రంతో పాటు, ఉత్తమ నటుడు (ప్రభాస్), ఉత్తమ దర్శకుడు (రాజమౌళి), ఉత్తమ ప్రతినాయకుడు (రానా), ఉత్తమ సంగీత దర్శకుడు (ఎం.ఎం.కీరవాణి), ఉత్తమ ఛాయగ్రాహకుడు (సెంథిల్ కుమార్), ఉత్తమ నేపథ్య గాయకుడు (కాలభైరవ) పురస్కారాలు వరించాయి. దుబాయ్‌లో రెండు రోజులపాటు ఆద్యంతం అట్టహాసంగా సాగిందీ వేడుక. రెండో రోజు తెలుగు, కన్నడ పరిశ్రమలకి పురస్కారాల్ని అందజేశారు. ఉత్తమ నటుడు పురస్కారాన్ని ప్రభాస్ తరపున కథానాయకుడు రానా అందుకొన్నారు. బాహుబలి ది కన్‌క్లూజన్‌లో నటనకిగానూ ఉత్తమ ప్రతినాయకుడిగా రానా బాలకృష్ణ నుంచి పురస్కారం స్వీకరించారు. రానాకి ఎంటర్టైనర్ ఆఫ్ ది ఇయర్ పురస్కారం కూడా లభించింది. గౌతమిపుత్ర శాతకర్ణి లో నటనకిగానూ నందమూరి బాలకృష్ణ ఉత్తమ నటుడుగా విమర్శకుల విభాగంలో పురస్కారం అందుకొన్నారు.
ప్రముఖ నటులు శరత్‌కుమార్, రాధికలు ఈ పురస్కారాన్ని బాలకృష్ణకి అందజేశారు. ఉత్తమ నటిగా నేనే రాజు నేనే మంత్రిలో కథానాయికగా నటించిన కాజల్‌కి పురస్కారం లభించింది. ఉత్తమ తొలి చిత్ర కథానాయకుడు ఇషాన్ (రోగ్), ఉత్తమ తొలి చిత్ర కథానాయికగా కల్యాణి ప్రియదర్శిని(హలో), ఉత్తమ తొలి చిత్ర దర్శకుడిగా సందీప్ వంగా (అర్జున్‌రెడ్డి), ఉత్తమ సహాయ నటుడుగా ఆది పినిశెట్టి (నిన్ను కోరి), ఉత్తమ సహనటిగా భూమిక (ఎమ్.సి.ఎ) ఉత్తమ నేపథ్య గాయనిగా మధుప్రియ (ఫిదా), ఉత్తమ గీత రచయితగా సుద్దాల అశోక్‌తేజ (ఫిదా), ఉత్తమ హాస్యనటుడిగా రాహుల్ రామకృష్ణ (అర్జున్ రెడ్డి)లకి పురస్కారాలు లభించాయి. గౌతమీపుత్ర శాతకర్ణి ఉత్తమ చిత్రంగా విమర్శకుల విభాగంలో పురస్కారాన్ని కైవసం చేసుకొంది. వేడుకలో ప్రగ్యా జైస్వాల్, శ్రియ, సుదీర్‌బాబు తదిరులు పాల్గొన్నారు. నాయికలు ఆటపాటలు, ర్యాంప్ వాక్‌లతో సందడి చేశారు.













