అభిమానులకు మరింత చేరువయ్యేందుకు సమంత ఏం చేస్తోందంటే..!
ఏమాయ చేసావె చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన సమంత ఇప్పుడు టాప్ హీరోయిన్గా ఎదగడం వెనుక ఎంతో కృషి ఉంది. అందంతోపాటు చక్కని అభినయాన్ని కనబరిచే సమంత కెరీర్లో ఎన్నో అద్భుతమైన సినిమాలు ఉన్నాయి. నాగచైతన్యతో పెళ్ళి తర్వాత కూడా తన విజయపరంపరను కొనసాగిస్తూనే ఉంది. ఈమధ్యకాలంలో సమంత చేసిన సినిమాలన్నీ ఘనవిజయం సాధించడం విశేషం. లాక్డౌన్ సమయంలో ఇంటికే పరిమితమైన సమంత ఆ సమయాన్ని కూడా సద్వినియోగం చేసుకుంది. ఎప్పటికప్పుడు తన ఆలోచనలను, అభిప్రాయాలను అభిమానులతో పంచుకుంటూ వారికి మరింత దగ్గరైంది. ఇంట్లోనే ఖాళీగా కూర్చోకుండా ఏదో ఒక వ్యాపకం ఉండేలా చూసుకుంది.
తన ఇంటి టెర్రస్‌పై సేంద్రీయ వ్యవసాయం చేస్తోంది. తన ఫిట్నెస్ను కాపాడుకునేందుకు వర్కవుట్ కూడా చేస్తోంది. అంతేకాదు ఫిట్నెస్ కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా వర్కవుట్ చెయ్యాలి వంటి విషయాలను అభిమానులతో పంచుకుంటోంది. ఇప్పుడు షూటింగులకు సడలింపు ఇవ్వడంతో తను పూర్తి చేయాల్సిన సినిమాలపై దృష్టి పెట్టింది. తాజాగా రామ్‌చరణ్ సతీమణి ఉపాసన కొణిదెలతో కలిసి యువర్ లైఫ్ అనే వెబ్‌సైట్‌ను స్టార్ట్ చేసింది. ఈ వెబ్‌సైట్‌కు గెస్ట్ ఎడిటర్‌గా పనిచేస్తోంది. ఈ వైబ్‌సైట్ ద్వారా ఎన్నో ఉపయోగకరమైన ఆరోగ్య సూత్రాలను, చిట్కాలను, డైట్ ఎక్స్పర్ట్స్ ఇచ్చే సలహాలను ప్రజలకు అందించేందుకు సిద్ధమయ్యారు సమంత. ఉపాసన ఈ వెబ్‌సైట్‌కు మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తారు. ప్రస్తుతం తమ ఆరోగ్యం పట్ల పూర్తి అవగాహన ఏర్పరుచుకునేందుకు ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. ఒక మంచి పనికి శ్రీకారం చుట్టిన సమంతను ఆమె అభిమానులు అభినందిస్తున్నారు.













