రామ్ కొత్త ప్రయోగం.. RAPO23లో విలన్‌గా జాకీ ష్రాఫ్?
టాలీవుడ్ లో ఎనర్జిటిక్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న రామ్ పోతినేని(Ram Pothineni) ఇప్పుడు తన కెరీర్లో మరో విభిన్నమైన అడుగేస్తున్నాడు. RAPO23 పేరుతో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్‌లో కేవలం హీరోగానే కాకుండా కథను స్వయంగా రాసి, డైరెక్షన్ రెస్పాన్సిబులిటీస్ ను కూడా చేపట్టడం ఆసక్తిని పెంచుతోంది. ఎలాంటి హడావుడి లేకుండా ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించిన చిత్రబృందం ప్రస్తుతం వేగంగా షూటింగ్ ను కొనసాగిస్తున్నట్లు సమాచారం. కొత్త శైలిలో సాగే నియో-నోయర్ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందుతోందనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్ గా సంయుక్త(Samyuktha menon) పేరు వినిపించగా, తాజాగా మరో ఇంట్రెస్టింగ్ ప్రచారం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రముఖ నటుడు జాకీ ష్రాఫ్(Jackie Shroff) ఈ సినిమాలో మెయిన్ విలన్ క్యారెక్టర్ లో కనిపించే అవకాశాలున్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. కథలో విలన్ పాత్రకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుందని, సాధారణ విలన్ గా కాకుండా స్ట్రాంగ్ ఎమోషనల్ లేయర్స్‌తో ఆ క్యారెక్టర్ ను డిజైన్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు.
ఇక ఈ సినిమాను భారీ నిర్మాణ విలువలతో కృష్ణ పోతినేని(Krishna Pothineni) నిర్మిస్తున్నారు. రామ్ తన గత సినిమాలకు భిన్నంగా మరింత డార్క్, ఇంటెన్స్ టోన్‌లో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించాలనే టార్గెట్ తో ఈ ప్రాజెక్ట్‌ను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. యాక్షన్, భావోద్వేగాలు, సస్పెన్స్ అంశాలను సమతుల్యంగా మిళితం చేస్తూ తెరకెక్కుతున్న ఈ సినిమా ఇప్పటికే సినీ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. నటీనటులు, ఇతర కీలక సాంకేతిక విభాగాలకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడయ్యే వరకు ఈ ప్రచారాలపై మరింత ఉత్కంఠ కొనసాగనుంది.








