ఉత్తమ బాలల చిత్రంగా జాతీయ అవార్డును గెలుపొందిన ’35 – చిన్న కథ కాదు’
72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2024 సంవత్సరానికి గాను ’35 – చిన్న కథ కాదు’ ఉత్తమ బాలల చిత్రం విభాగంలో జాతీయ పురస్కారానికి ఎంపికైంది. అలాగే ఈ చిత్రంలో నటించిన అరుణ్దేవ్ పోతుల ఉత్తమ బాల నటుడు విభాగంలో జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు.
2024లో విడుదలైన ’35 – చిన్న కథ కాదు’ చిత్రంలో నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్ ప్రధాన పాత్రలు పోషించారు. నందకిశోర్ ఈమాని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సృజన యర్రబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించారు. విడుదల సమయంలో ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం, ఇప్పుడు జాతీయ చలనచిత్ర పురస్కారాల్లోనూ తన సత్తా చాటింది.
మరో విశేషం ఏమిటంటే… గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ‘బాల రామాయణం’ (1996) తర్వాత దాదాపు మూడు దశాబ్దాల అనంతరం తెలుగు సినిమా ఉత్తమ బాలల చిత్రం విభాగంలో జాతీయ అవార్డుకు ఎంపిక కావడంవిశేషం. ఆ అరుదైన ఘనతను ’35 – చిన్న కథ కాదు’ సొంతం చేసుకోవడం తెలుగు చిత్రసీమకు గర్వకారణంగా నిలిచింది.








