రాజకీయాల్లోకి రజనీ?
తమిళ సినీనటుడు సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయాలలోనికి వస్తున్నట్లు మరోమారు వార్తలు గుప్పుమంటున్నాయి. మొన్న రజనీ కాంత్ సతీమణి లతసైతం తన భర్త రాజకీయాలలోకి వచ్చే అవకాశాలు కొట్టిపారేయలేమంటూ, త్వరలో తగిన నిర్ణయం తీసుకుంటారంటూ ప్రకటించడంతో మళ్లీ చర్చమొదలైంది. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆకాల మరణంతో తమిళ రాజకీయాలలో పెనుమార్పులు సంభవిస్తున్నాయి. అన్నాడిఎంకె రెండు వర్గాలుగా విడిపోవటం, జయ మేనకోడలు మరో పార్టీ పెట్టుకోవటం నడుమ లబ్ధిపొందాలని చూస్తున్న డిఎంకె పార్టీకి చెక్ చెప్పాలని బిజెపీ సైతం భావిస్తోంది. జయ మరణంతో ఏర్పడిన రాజకీయ లోటు అంతటి అభిమాన ధనమున్న రజనీ ఒక్కడిగే సాధ్యమని భావించిన బిజెపీ ఇప్పటికే పలుమార్లు సీనియర్లతో సంప్రదింపులు జరుపుతోంది. ఈ నేపథ్యంలో ఆర్కేనగర్ స్థానం నుంచి సినీ సంగీత దర్శకుడు గంగై అమరన్‌ని రంగంలోకి దింపి రజనీ మద్దతుకోసం పంపింది. తొలుత ఆశీస్సులుంటాయని ప్రకటించిన రజనీ ఆపై కాస్త వెనుకడువేసి, తన మద్దతు ఎవరికీ లేదని తేల్చిచెప్పారు. అయితే రజనీకాంత్ తన అభిమానులను ఏప్రిల్ 2న కలిసేందుకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం గమనార్హం. రాజకీయాలలో వచ్చేందుకు తగిననిర్ణయం తీసుకునేందుకు వీలుగానే ఈ సమావేశం జరుగుతున్నట్లు రజనీ అభిమానులు చెపుతుండటం విశేషం. ఏదేమైనా రజనీ బిజెపీలో చేరటమా? కొత్త పార్టీని ప్రకటించడమో, అసలు రాజకీయాలలోకి వచ్చేదీ, లేనిదీ తేల్చిచెప్పడం జరుగుతుందని సర్వతా ఉత్కాంఠ మొదలైంది.













