ఆ వ్యాపారంలో ప్రియాంక భాగస్వామి
సినీ రంగంలో కోట్లు సంపాదించేవాళ్లు ఆ డబ్బును బ్యాంకుల్లో వేసుకొని సైలెంటుగా ఉండరు. తమ డబ్బును ఏదో ఒక వ్యాపారంలో పెట్టి బాగా సంపాదించాలని కోరుకుంటారు. బాలీవుడ్ స్టార్ బ్యూటీ ప్రియాంక చోప్రా ప్రస్తుతం ఈ ప్రయత్నంలోనే ఉంది. ఆమె మహిళల కోసం ఏర్పాటైన సోషల్ నెట్వర్కింగ్ యాప్ బంబుల్ లో పెట్టుబడి పెట్టడం విశేషం. ఈ వ్యాపారంలో తాను భాగస్వామిగా అయినట్లుగా ప్రియాంక స్వయంగా ట్విట్టర్లో వెల్లడించింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన ఈ యాప్ త్వరలోనే ఇండియాలోకి రానుంది. బంబుల్ లో పెట్టుబడి పెట్టిన ప్రియాంక ఈ యాప్ లాంచింగ్, వ్యూహాలు, ప్రచార కార్యక్రమల్లో తలమునకలై ఉన్నట్లు యాప్ సీఈవో విట్నే వోల్ఫ్ హెర్డ్ తెలిపారు. ఇప్పుడున్న సోషల్ నెట్వర్కింగ్ సైట్లు మహిళలకు అంత సురక్షితం కాకపోవడంతో తమ యాప్లో వారి భద్రతకు అధిక ప్రాధాన్యతనిచ్చామని తెలిపారు. గత ఏడాది లాంచ్ అయిన ఈ యాప్ 160 దేశాలలో పనిచేస్తోంది. 2.7 కోట్ల మంది ఈ యాప్ను వినియోగిస్తున్నారు.













