2025 క్రిస్మస్ టార్గెట్గా స్పిరిట్
ప్రభాస్ హీరోగా రానున్న స్పిరిట్ సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్లింది కూడా లేదు కానీ ఆ సినిమా మాత్రం ఇప్పటినుంచే హాట్ టాపిక్ గా మారింది. యానిమల్ ప్రమోషన్స్ లో భాగంగా సందీప్ రెడ్డి వంగాను అందరూ ఈ సినిమా గురించే అడుగుతున్నారు. అయితే స్పిరిట్ మూవీని వచ్చే యేడాది సెప్టెంబర్ నుంచి స్టార్ట్ చేయాలని చూస్తున్నాడట సందీప్.
జూన్ కు స్క్రిప్ట్ వర్క్ ఫినిష్ చేసి, 2025 క్రిస్మస్ కు లేదా 2026 సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. స్పిరిట్ లో ప్రభాస్ పోలీసాఫీసర్ గెటప్ లో కనిపించనున్నాడు. డ్యూటీ మీద లిమిట్స్ దాటిన కమిట్మెంట్ ఎలా ఉంటుందో ప్రభాస్ క్యారెక్టర్ ను అలా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు, అర్జున్ రెడ్డి, యానిమల్ లో హీరోను ధనవంతుల కుటుంబాల్లో సెట్ చేసిన సందీప్, స్పిరిట్ లో ప్రభాస్ ను మాత్రం మిడిల్ క్లాస్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వ్యక్తిగా సెట్ చేస్తున్నాడట.
ఇవన్నీ విన్న ప్రభాస్ ఫ్యాన్స్ కు ఎప్పుడెప్పుడు తమ అభిమాన హీరోను ఖాకీ చొక్కాలో చూస్తామా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం సలార్ సినిమా రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్న ప్రభాస్, ఆ తర్వాత నాగ్ అశ్విన్ తో కల్కి, మారుతితో రాజా డీలక్స్ సినిమాలు చేస్తున్నాడు. మరోవైపు సందీప్ రెడ్డి వంగా యానిమల్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు.













