టాలీవుడ్లో టాప్ హీరోయిన్ అయినా దృష్టంతా బాలీవుడ్‌పైనే!
ముంబైలో పుట్టి పెరిగిన పూజా హెగ్డే వాస్తవానికి కర్ణాటకకు చెందిన కుటుంబం నుంచి వచ్చింది. ఎం.కాం పూర్తి చేసిన పూజా ఆ తర్వాత మోడలింగ్‌లోకి దిగి సినిమా ఛాన్సుల కోసం ప్రయత్నిస్తూ ఉండేది. కానీ, బాలీవుడ్లో ఆమెను ఎవ్వరూ పట్టించుకోలేదు. ముంబై హీరోయిన్లకు సౌత్‌లో మంచి డిమాండ్ ఉంటుంది కాబట్టి ఇటువైపు ఓ కన్ను వేసింది. దాంతో ఓ తమిళ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. 2012లో జీవా హీరోగా తమిళ్లో రూపొందిన ముగమూడి చిత్రంలో అవకాశం వచ్చింది. ఆ సినిమా ఆశించినంత విజయం సాధించకపోవడం, ఆమెకు అంతగా గుర్తింపు రాకపోవడంతో మళ్లీ ముంబై చెక్కేసింది. రెండు సంవత్సరాల తర్వాత ఒకలైలా కోసం చిత్రంలో నాగచైతన్య సరసన నటించే అవకాశం వచ్చింది. అదే సంవత్సరంలో వరుణ్‌తేజ్ తొలి సినిమా ముకుందలో హీరోయిన్గా నటించింది. రెండు సినిమాలు వరసగా రావడంతో ఇక తన కెరీర్‌కి ఢోకా లేదనుకుంది. ఈ రిఫరెన్స్‌తో బాలీవుడ్లో ఓ భారీ సినిమాలో ఛాన్స్ సంపాదించింది.
హృతిక్‌రోషన్ హీరోగా అశుతోష్ గోవారికర్ వంటి టాప్ డైరెక్టర్ సినిమాలో హీరోయిన్గా ఎంపికైంది. ఇంకేముందు వెంటనే రెక్కలు కట్టుకొని ముంబైలో వాలిపోయింది. ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఎంత స్పీడ్‌గా వెళ్లిందో అంతే స్పీడ్‌గా మళ్లీ టాలీవుడ్‌కి వచ్చేసింది. ఆ తర్వాత దువ్వాడ జగన్నాథమ్‌తో స్టార్ట్ అయిన ఆమె విజయపరంపర అల వైకుంఠపురములో వరకు దిగ్విజయంగా కొనసాగింది. ఇప్పడు టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా వెలుగొందుతోంది. టాప్ హీరోలకు పూజా ఒక ఆప్షన్‌గా మారింది. ఆమెకు ఉన్న డిమాండ్‌కి తగ్గట్టుగానే రెమ్యునరేషన్ కూడా పెంచేసింది.
ప్రభాస్ హీరోగా రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్‌లో హీరోయిన్గా నటిస్తోంది. అంతేకాదు అఖిల్ హీరోగా రూపొందుతున్న మోస్ట్ ఎలిజిబుట్ బ్యాచ్‌లర్‌లో కూడా నటిస్తోంది. అయినప్పటికీ బాలీవుడ్‌పై ఆమెకు ఉన్న మోజు మాత్రం తగ్గలేదు. అక్కడ మంచి ఛాన్స్ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అందులో భాగంగానే ఇప్పుడు బచ్చన్ పాండే అనే సినిమాలో నటిస్తోంది. టాలీవుడ్లో టాప్ హీరోయిన్ అయినప్పటికీ ఈ బాలీవుడ్ మూవీలో సెకండ్ హీరోయిన్గా నటించేందుకు ఒప్పుకుంది. అక్షయ్‌కుమార్ హీరోగా కృతి సనన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 25న విడుదల కావాల్సి ఉంది. అదే రోజు అమీర్‌ఖాన్ హీరోగా నటిస్తున్న లాల్‌సింగ్ చద్దా కూడా విడుదలవుతోంది. ఈ రెండు సినిమాలకు క్లాష్ రావడంతో బచ్చన్ పాండేను జనవరి 20న విడుదల చేయాలని నిర్ణయించారు. బచ్చన్ పాండేలో అంతగా ప్రాధాన్యం లేని పాత్రను చేసిన పూజాకు ఈసారి ఎలాంటి ఫలితం వస్తుందో చూడాలి.













