పవన్-తేజూ మూవీ .. ఓ డేరింగ్ డెసిషన్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కలయికలో సముద్రఖని దర్శకత్వంలో వినోదాయ సీతం రీమేక్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పవన్ తాలూకా షూట్ పూర్తయిపోయింది. ఓ పాట షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. కానీ ఆ పాటను షూట్ చేయాలా వద్దా అనేది తర్వాత నిర్ణయించబోతున్నారు.
ఒకవేళ ఆ పాట లేకపోయినా సినిమా ఏం డిస్ట్రబ్ అవకుండా ఉండేలా స్క్రిప్ట్ ను ప్లాన్ చేసుకున్నాడట సముద్రఖని. ఇదిలా ఉంటే ఈ సినిమా టైటిల్ గురించి నెట్టింట ఎన్నో ప్రచారాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం #PKSDT మూవీ పేరిట ఈ సినిమాను పిలుస్తున్నారు. ఈ సినిమాకు దేవుడు, దేవర అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నట్లు ఎప్పటినుంచో వార్తలొస్తున్నాయి.
కానీ తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా టైటిల్ విషయంలో చిన్న మార్పు జరిగినట్లు సమాచారం. ఈ మూవీ రిలీజ్ అయ్యాక టైటిల్ ను పెట్టే దిశగా చిత్ర మేకర్స్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన టిజి విశ్వప్రసాద్ ఓ ఇంటర్య్వూలో ఈ విషయం చెప్పడంతో పవన్ ఫ్యాన్స్ ఒక్కసారిగా షాకవుతున్నారు. ఇలాంటి సాహసం ఇప్పటివరకు ఏ స్టార్ హీరో చేయలేదు.
గతంలో జేడీ చక్రవర్తి, మీనా నటించిన ఓ సినిమాను ఇలానే పేరు లేని సినిమాగా రిలీజ్ చేసి, తర్వాత ఆడియన్స్ నుంచి వచ్చిన టైటిల్స్‌ను పరిశీలించి, ఆ సినిమాకు పాపే నా ప్రాణం అని ఫిక్స్ చేశారు. అప్పట్లో దాని గురించి పెద్ద చర్చే జరిగింది. అప్పటి నుంచి తర్వాత ఎవరూ మళ్లీ ఆ సాహసం చేయలేదు. ఇప్పుడు మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఓ స్టార్ హీరో సినిమాకు, అది కూడా ఓ మల్టీస్టారర్ మూవీకి ఈ విధంగా ఆలోచించడం అంటే పెద్ద సాహసమనే చెప్పాలి. ఇంకా సినిమా రిలీజ్ కు మూడు నెలల టైముంది కాబట్టి, దర్శకనిర్మాతలు ఇదే నిర్ణయంతో ఉంటారా లేక తమ డెసిషన్ ను మార్చుకుంటారా అనేది చూడాలి.













