దారులే వేరే …ఇద్దరీ లక్ష్యం ఒక్కటే!
ప్రముఖ విలక్షణ నటదిగ్గజం కమల్ హాసన్ సూపర్ స్టార్ రజనీకాంత్‌తో సమావేశమయ్యారు. తమిళనాడులో కమల్ హాసన్ మెగా యాత్ర చేపట్టనున్న నేపథ్యంలో చెన్నయ్‌లో పోయెన్గార్డెన్లోని రజినీ నివాసంలో వీరిరువురు భేటీ అయ్యారు. తాము ఎంచుకున్న దారులు వేరైనా ఇద్దరీ లక్ష్యమూ ప్రజలకు మంచి జరగాలన్నదేనని తమ ధ్యేయమని భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇరువురు సూపర్ స్టార్లు వ్యాఖ్యానించారు. దాదాపు పదిహేను నిమిషాల సేపు సమావేశమయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కమల్ మాట్లాడుతూ రజినీని మర్యాదపూర్వకంగానే కలిశానని అన్నారు. ఇద్దరి మధ్య రాజకీయాంశాలేమీ చర్చలోకి రాలేదన్నారు. రజినీతో కలిసి పనిచేస్తారా అనే ప్రశ్నకు ఎప్పటిగాలే సమాధానమిస్తూ, దానికి కాలమే నిర్ణయిస్తుందన్నారు. ఈ నెల 21న మధురైలో కమల్ ప్రకటించనున్న పార్టీ ప్రారంభోత్సవానికి రావాలని రజినీని ఆహ్వానించానన్నారు. రజినీకాంత్ మాట్లాడుతూ డబ్బు, పేరు, అధికారం కోసం కమల్ రాజకీయాల్లోకి రావడం లేదని, కేవలం ప్రజలకు సేవ చేయాలనే గొప్ప సంకల్పంతో వస్తున్నారన్నారు. ఆయన విజయవంతమవ్వాలని రజినీ ఆకాంక్షించారు.













