ఇది అదే కథా?
టాప్ హీరోలు ఎవరైనా ఒక కథ ఓకే చెయ్యాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని. ఎందుకంటే వారికి ఉన్న ఇమేజ్, అభిమానుల్ని దృష్టిలో పెట్టుకొని ఎలాంటి కథతో సినిమా చెయ్యాలనేది ప్లాన్ చేస్తుంటారు. ఒకవేళ కథ ఓకే అయితే అందులో ఎన్నో మార్పులు, చేర్పులు ఉంటాయి. కథ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకునే హీరోలు ఒక్కోసారి మంచి కథను మిస్ చేసుకుంటూ ఉంటారు. అలా చాలా మంది హీరో విషయంలో జరిగింది. ఆమధ్య ఎన్టీఆర్, ప్రభాస్ రిజెక్ట్ చేసిన కథతో డైరెక్టర్ సురేందర్‌రెడ్డి… రవితేజతో ‘కిక్’ చేసి సూపర్‌హిట్ కొట్టాడు. ఒక్కోసారి కథ జడ్జిమెంట్ విషయంలో హీరోలు తప్పులో కాలేస్తూ ఉంటారు. తాజాగా పవన్‌కల్యాణ్ కోసం హరీష్ శంకర్ రెడీ చేసిన కథ కూడా అలాంటిదేనన్న వార్తలు వస్తున్నాయి.
గతంలో ఎన్టీఆర్‌తో హరీష్ ‘రామయ్యా వస్తావయ్యా’ సినిమా చేశాడు. ఆ కథ కంటే ముందు మరో కథ ఎన్టీఆర్‌కి వినిపించాడు. అయితే ఆ కథను ఎన్టీఆర్ రిజెక్ట్ చేశాడు. అప్పటి నుంచి ఆ కథ హరీష్ శంకర్ దగ్గరే ఉంది. దానికి కొన్ని మెరుగులు దిద్ది పవన్‌కల్యాణ్‌కి వినిపించాడట. పవన్‌కల్యాణ్ 28వ సినిమాని అదే కథతో హరీష్ శంకర్ చెయ్యబోతున్నాడని సమాచారం. ప్రస్తుతం ‘వకీల్ సాబ్’ చిత్రంలో నటిస్తున్న పవన్ ఈ సినిమా తర్వాత క్రిష్ డైరెక్షన్లో మరో సినిమా చెయ్యాల్సి ఉంది. అది కూడా కంప్లీట్ అయిన తర్వాత హరీష్ శంకర్ సినిమా ఉంటుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు మెరుగు పడితే తప్ప మళ్లీ షూటింగులు ప్రారంభం అయ్యే అవకాశం లేదు. కరోనా మహమ్మారి ప్రపంచం నుంచి కనుమరుగైతే తప్ప సినిమా ఇండస్ట్రీకి పూర్వ వైభవం రాదు.













