పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ కాదు.. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్..!
త్రివిక్రమ్ డైరెక్షన్లో వచ్చిన అత్తారింటికి దారేది సినిమా ఎప్పుడైతే బ్లాక్‌బస్టర్ హిట్ అయిందో అప్పటి నుంచి `అ` అనేది త్రివిక్రమ్ సెంటిమెంట్‌గా మారిపోయింది. ఆ తర్వాత అజ్ఞాతవాసి, అరవింద సమేత, అ ఆ, అల వైకుంఠపురములో..ఇలా అన్నీ `అ` తో మొదలయ్యే టైటిల్సే పెట్టడం అతనికి అలవాటైపోయింది. ఈమధ్యకాలంలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బేనర్లోనే త్రివిక్రమ్ ఎక్కువ సినిమాలు చేశాడు. దాంతో ఆ బేనర్లో ఏ కొత్త సినిమా టైటిల్ రిజిష్టర్ చేసినా అది త్రివిక్రమ్ సినిమా కోసమేనని అందరూ భావిస్తున్నారు. ఇటీవల ఆ బేనర్లో అయినను పోయిరావలె హస్తినకు అనే పొలిటికల్ టైటిల్‌ను రిజిష్టర్ చేశారు. దీంతో అది త్రివిక్రమ్ సినిమానే అనుకున్నారు. అందులోనూ `అ`తో టైటిల్ మొదలు కావడంతో అది ఇంకా బలపడింది. దానికితోడు ఎన్టీఆర్ తన 30వ సినిమా త్రివిక్రమ్ కాంబినేషన్లోనే చేయబోతున్నాడు. వీరిద్దరి కాంబినేషన్లో రూపొందే సినిమాకు అయినను పోయిరావలె హస్తినకు అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారని ప్రచారం జరిగింది. ఎన్టీఆర్‌తోపాటు త్రవిక్రమ్ కూడా మొదటిసారి పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా చేయబోతున్నారని అందరూ భావించారు.
కానీ, ఇప్పుడు ఓ కొత్త న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది ఏమిటంటే ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్లో రాబోతున్న సినిమా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చెప్పుకుంటున్నారు. మరి అయినను పోయిరావలె హస్తినకు అనే టైటిల్‌ను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ వారు ఎవరి కోసం రిజిష్టర్ చేయించారనే కొత్త ప్రశ్న అందరిలోనూ తలెత్తింది. మరోపక్క మొదట ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్లో పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా చేద్దామనుకున్నారని, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా చేస్తే వర్కవుట్ అవ్వదని, అందుకే మరో కథతో ఎన్టీఆర్ సినిమా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. మరి ఈ కొత్త సినిమా టైటిల్ ఏమిటి, ఎలాంటి టైటిల్ తమ అభిమాన హీరో సినిమాకి త్రివిక్రమ్ పెడతాడని అభిమానులు ఎదురుచూస్తున్నారు.













