ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఎన్టీఆర్ రామ్‌చరణ్‌ల ఎంట్రీ సాంగ్ ఎలా ఉండబోతుంది?

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌ల ఎంట్రీ సాంగ్ విషయమై (రౌద్రం రణం రుధిరం) ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమాకు సంబంధించి రోజుకో అప్‌డేట్ వైరల్ అవుతోంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా ఎప్పుడైతే ఈ ప్రాజెక్ట్ షురూ చేశారో అప్పటినుంచి జనాల్లో ఓ రేంజ్ అంచనాలు నెలకొన్నాయి. చిత్రంలో ఆ ఇద్దరి క్యారెక్టర్స్ ఎలా ఉండబోతున్నాయి? ఎవరికి స్క్రీన్ స్పేస్ ఎక్కువ ఉంటుంది? అనే దానిపై చర్చలు ముదిరాయి. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ల ఎంట్రీ సాంగ్ గురించిన ఓ అప్‌డేట్ జనాల్లో యమ క్రేజీగా మారింది.
చాలా కాలంగా షూటింగ్ ఆర్ ఆర్ ఆర్ చేస్తున్న జక్కన్న.. కేవలం రెండు పాటల చిత్రీకరణ మినహా అంతా ఫినిష్ చేశారట. మిగిలిన ఈ పార్ట్ పూర్తి చేయడానికి కనీసం 45 నుంచి 50 రోజుల వరకు సమయం పడుతుందట.
ఇందులో ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ల ఎంట్రీ సాంగ్ ఉందని, ఆ ఒక్క పాట పూర్తి కావడానికే కనీసం 30రోజులు పడుతుందని సమాచారం. విజువల్ వండర్‌లా ఉండేలా ఈ సాంగ్ ప్లాన్ చేశారట రాజమౌళి. ఇక మరో పాట రామ్‌చరణ్, అలియాభట్ జోడీపై షూట్ చేయాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితులు చక్కబడగానే తిరిగి షూటింగ్ మొదలు పెట్టనున్నారని సమాచారం. ఇకపోతే కొమరంభీమ్ క్యారెక్టర్‌లో తారక్ కంటతడి పెట్టిస్తారంటూ విజయేంద్ర ప్రసాద్ ఇచ్చిన హింట్ సినిమాపై ఉన్న అంచనాలకు రెక్కలు కట్టింది. చిత్రంలో అల్లూరి సీతారామ రాజుగా రామ్ చరణ్ కనిపించబోతున్నారు. డీవీవీ దానయ్య సమర్పణలో భారీ బడ్జెట్ కేటాయించి రూపొందిస్తున్న ఈ ఆర్ ఆర్ ఆర్ మూవీలో ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరిస్, రామ్ చరణ్ సరసన ఆలియా భట్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ పాన్ ఇండియా మూవీ రిలీజ్ కోసం జనం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.