ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌పై ‘నిశ్శబ్దం’ విడుదల కానుందా?
ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌పై ‘నిశ్శబ్దం’ విడుదల కానుందా? కరోనా వైరస్ వ్యాప్తి ఉధ్ధృతంగా ఉన్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. దీని ప్రభావం అన్ని పరిశ్రమలపై ప్రభావం పడిరది. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి తీరని నష్టం వాటిల్లుతోంది. షూటింగులు ఎక్కడిక్కడ ఆగిపోయాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైన సినిమాలు థియేటర్స్ బంద్ వల్ల రిలీజ్‌కి నోచుకోవడం లేదు. ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితుల్ని బట్టి ఇప్పట్లో థియేటర్స్ తెరుచుకునే అవకాశం లేదు. దీంతో కోట్లు వెచ్చించి సినిమాలు నిర్మించిన నిర్మాతలు ఆలోచనలో పడ్డారు. వారికి ప్రస్తుతం కనిపిస్తున్న ఒకే ఒక అధారం ఓటీటీ ఫ్లాట్‌ఫామ్. దీని ద్వారా సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నారు.
అందుకు చాలా మంది నిర్మాతలు తమ సినిమాలను ఓటీటీ ద్వారా రిలీజ్ చేసేందుకు సమ్మతిస్తున్నారు. తాజాగా ‘అమృతరామమ్’ అనే చిత్రాన్ని ఓటీటీ ద్వారా విడుదల చేసారు. తెలుగులో ఓటీటీ ద్వారా విడుదలైన తొలి సినిమా ఇదే కావడం విశేషం. అయితే ఇప్పటివరకు పెద్ద బడ్జెట్ సినిమాలు, ఒక రేంజ్ సినిమాలు ఓటీటీ వరకు రాలేదు. తాజాగా అనుష్క హీరోయిన్గా నటించిన ‘నిశ్శబ్దం’ చిత్రాన్ని ఓటీటీ ద్వారా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఈ చిత్రాన్ని ఓటీటీ ద్వారా రిలీజ్ చేసేందుకు రూ.26 కోట్లకు కొనుగోలు చేశారని తెలుస్తోంది. శాటిలైట్ హక్కులు కాకుండానే ఒక ఓటీటీ సంస్థ ఈ మొత్తాన్ని చెల్లించిందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.













