మే 31న కృష్ణ బర్త్ డే సందర్భంగా మహేష్ బాబు, కృష్ణ అభిమానులకు స్పెషల్ ట్రీట్!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ఒక్కో సినిమాతో ఒక్కో విజయాన్ని సొంతం చేసుకుంటూ నటుడిగా తన క్రేజ్ పాపులారిటీని విపరీతంగా పెంచుకుంటూ ముందుకు కొనసాగుతున్నారు. ఇక తాజాగా నటిస్తున్న సినిమా ‘సర్కారు వారి పాట’ తప్పకుండా భారీ సక్సెస్ కొట్టి మహేష్ ఖాతాలో మరో విజయాన్ని నమోదు చేయడం ఖాయమని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు. 14 రీల్స్ ప్లస్ మైత్రి మూవీ మేకర్స్, జిఎంబి ఎంటర్ టైన్మెంట్స్ సంస్థల పై ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతున్న ఈ సినిమాని పరశురామ్ తెరకెక్కిస్తున్నాడు. కీర్తిసురేష్ ఇందులో మహేష్ కు జోడీగా నటిస్తోంది. ఇక మహేష్ బాబు ఈ సినిమాలో ఒక విభిన్నమైన పాత్ర పోషిస్తుండగా బ్యాంకింగ్ రంగంలో జరిగిన పలు కుంభకోణాల నేపథ్యంలో ఈ సినిమా మంచి మెసేజ్ తో కూడిన మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోందని సమాచారం. ప్రస్తుత కరోనా పరిస్థితులు తగ్గిన అనంతరం వీలైనంత త్వరగా సర్కారు వారి పాట తదుపరి షెడ్యూల్ మొదలు పెట్టేలా యూనిట్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నారు కానీ పరిస్థితులు అనుకూలిస్తే విడుదల తేదీ ప్రకటిస్తారు.
అసలు విషయం ఏమిటంటే… ప్రతి ఏడాది తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ జన్మదినం రోజున తన సినిమాలకు సంబంధించిన టీజర్ లేదా ట్రైలర్ లేదా ఫస్ట్ లుక్, టైటిల్ వంటివి విడుదల చేసే అలవాటు గల మహేష్ బాబు ఈ ఏడాది మే 31న కృష్ణ బర్త్ డే సందర్భంగా సర్కారు వారి పాట ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు ఇటీవల దుబాయ్ లో జరిగిన షూటింగ్ మేకింగ్ వీడియోని విడుదల చేయటానికి నిర్ణయించినట్లు తెలుస్తోంది. అలానే తన తదుపరి త్రివిక్రమ్ తో చేయబోయే సినిమాకు సంబంధించిన టైటిల్ ఎనౌన్స్ మెంట్ కూడా ఆ రోజే రానున్నట్లు సమాచారం. అయితే సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే మరొక పది రోజుల సమయం మిగిలి ఉండటంతో ఇప్పటినుంచే మహేష్ బాబు, కృష్ణ అభిమానులు పలు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ఆయనకు ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు సర్కారు వారి పాట అప్ డేట్స్ పేరుతో పలు ట్రెండ్స్ ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. మరి కృష్ణ జన్మదినం రోజున సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి ఎటువంటి సర్ప్రైజ్ రానుందో? చూద్దాం.