ఇర్ఫాన్ ఖాన్‌కు ఇదే నిజమైన నివాళి
సినిమా తారలుగానీ, ఇతర ప్రముఖులుగానీ అనారోగ్యంతోనో, మరే కారణంతోనో మరణిస్తే వారికి సంతాపాలు తెలియజేస్తారు. ఒక మంచి మనిషిని కోల్పోయామని ప్రకటనలు చేస్తారు. అయితే నిజానికి ఆ మరణించిన వ్యక్తి అంత ఉత్తముడా? అనేది ప్రస్తావించరు. ఎందుకంటే చనిపోయినవారి గురించి చెడు మాట్లాడకూడదన్నది మన భారతీయ సంప్రదాయం. దాన్ని దృష్టిలో ఉంచుకుంటారు కాబట్టే ఎవరూ చనిపోయినవారి గురించి చెడుగా మాట్లాడరు. కానీ, బ్రతికి ఉన్నప్పుడు ఎంతో మందికి సేవ చేసి, ఎంతో మందికి చేయూతనిస్తూ అందరినోటా మంచివాడు అని పేరు తెచ్చుకున్నవారికి చనిపోయిన తర్వాత ఎలాంటి గౌరవం దక్కుతుందో తెలియాంటే అంతర్జాతీయ నటుడు దివంగత ఇర్ఫాన్ ఖాన్ గురించి ఓ గ్రామ ప్రజలు తీసుకున్న నిర్ణయం గురించి తెలుసుకోవాల్సిందే.
అది మహారాష్ట్రలోని ఇగాత్పురి గ్రామం. అక్కడ ఇర్ఫాన్‌ఖాన్ కొంత భూమి కొన్నాడు. అప్పటికి ఆ గ్రామంలో ఎలాంటి వసతులు లేవు. ఎలాంటి అభివృద్ధికీ ఆ గ్రామం నోచుకోలేదు. ఇది తెలుసుకున్న ఇర్ఫాన్ ఆ గ్రామానికి ఏదో ఒకటి చెయ్యాలనుకున్నాడు. గిరిజనులు ఎక్కువగా ఉన్న ఆ గ్రామంలో విద్యార్థులు చదువుకునేందుకు సరైన సౌకర్యాలు లేవు. దీంతో ఆ విద్యార్థులకు కావాల్సిన పుస్తకాలు, స్వెటర్లు, రెయిన్ కోట్లు, ఇతర నిత్యావసరాలన్నీ సమకూర్చాడు. ఆ విద్యార్థుల కుటుంబ సభ్యులతో కలిసిపోయి ప్రతి పండగను వారితో జరుపుకునే వాడు. అలా ఆ గ్రామంలోని అందరికీ కుటుంబ సభ్యుడిగా మారిపోయాడు. ఎవరికి ఏ అవసరం వచ్చినా తనని కలవడానికి సంకోచించవద్దని, తాను సహాయం చేస్తానని ఆ గ్రామ ప్రజలకు హామీ ఇచ్చాడు. ఇటీవల ఇర్ఫాన్ మరణించడంతో ఆ గ్రామంలో విషాద ఛాయు అలముకున్నాయి. తమ కుటుంబ సభ్యుడు దూరమైనంతగా బాధపడ్డారు. ఇగాత్ పురి గ్రామానికి, తమ పిల్లలకు నిస్వార్థంగా ఇర్ఫాన్ చేసిన సేవలకు గుర్తింపుగా తమ గ్రామానికి ఇర్ఫాన్ ఖాన్ పేరు పెట్టుకోవడం అతనికి అందించే నిజమైన నివాళిగా ఆ గ్రామ ప్రజలు భావిస్తున్నారు.













