ఈ నెల 22న మా ప్రమాణ స్వీకారం
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు అత్యంత రసవత్తరంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో నటుడు శివాజీరాజా ప్యానల్‌పై నరేష్ ప్యానల్ విజయం సాధించిన సంగతి విదితమే. కాగా ఈ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఈ నెల 22న జరగనుంది. అయితే శివాజీ రాజా పదవీకాలం ఈ నెల 31 వరకు ఉండటంతో కొత్త బాడీ అప్పటి వరకూ నూతన మా కార్యవర్గం ప్రమాణం చేస్తే కోర్టుకు వెళతానని తనకు ఫోన్ చేసి బెదిరిస్తున్నారని నరేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించిన కృష్ణమోహన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు విషయాలను వెల్లడించారాయన.
ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ మా లో కొన్ని అవకతవకలు జరిగిన మాట వాస్తవం అని అవన్నీ మర్చిపోయి అందరినీ కలుపుకుని పనిచేయాలని నిర్ణయించుకున్నామని అన్నారు. అయినా మమ్మల్ని వర్క్ చేయకుండా వెనక్కు లాగుతున్నారని అన్నారు. ఇండస్ట్రీలోని పెద్దల అంగీకారంతో వారి సమక్షంలో ఈ నెల 22న ప్రమాణ స్వీకారం చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. పెద్దలు ఎలా చెబితే అలా మేం చేయటానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ సమావేశంలో మా ఉపాధ్యక్షుడు రాజశేఖర్, జనరల్ సెక్రటరీ జీవిత రాజశేఖర్, ఇసి మెంబర్లు పాల్గొన్నారు.













