ఏపీలో తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి అందరం కలిసికట్టుగా కృషి చేద్దాం: కోమటి జయరామ్
ఆంధ్రప్రదేశ్లో టాలీవుడ్ పరిశ్రమను మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు, నూతన వసతులు కల్పించేందుకు చిత్ర పరిశ్రమలోని ప్రతి ఒక్కరూ సమన్వయంతో కృషి చేయాలని ఉత్తర అమెరికాలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, ప్రముఖ ఎన్నారై కోమటి జయరామ్ పిలుపునిచ్చారు. మంగళగిరి, తాడేపల్లి నగరపాలక పరిధిలోని ఆత్మకూరు వద్ద ఉన్న ఓ రిసార్ట్లో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ దశాబ్ది వేడుకల్లో ఆయన ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు అటు విశాఖపట్నం ప్రాంతం, ఇటు రాష్ట్ర రాజధాని అమరావతి ప్రాంతాలు రెండు కూడా ఎంతో అనుకూలంగా ఉంటాయని అభిప్రాయపడ్డారు. నిర్మాతలు, దర్శకులు, నటీనటులు, డిస్ట్రిబ్యూటర్లు , థియేటర్ల యజమానులలో చాలామంది ఆంధ్రప్రదేశ్ ప్రాంతం నుంచే వెళ్లినవారేనని గుర్తుచేశారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని, ఏపీలోనూ సినిమా రంగానికి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్టూడియోలు , షూటింగ్ లొకేషన్ల అభివృద్ధికి అందరం కలిసికట్టుగా ముందుకు సాగాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు.
ఈ దశాబ్ది వేడుకల వేదికగా ఏపీలో సినీ పరిశ్రమ విస్తరణకు సంబంధించిన పలు కీలక అంశాలపై సినీ ప్రముఖులతో ఆయన చర్చించారు. ఈ కార్యక్రమంలో ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు అంబటి మధుమోహనకృష్ణ, ఏపీ నాటక అకాడమీ ఛైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ, ప్రముఖ నిర్మాతలు, నటీనటులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ వేడుకలను దిగ్విజయవంతం చేశారు.








