వారణాసి షూటింగ్ లేటెస్ట్ అప్డేట్!
ఎస్.ఎస్. రాజమౌళి(rajamouli) దర్శకత్వంలో మహేష్ బాబు(mahesh babu) హీరోగా తెరకెక్కుతున్న వారణాసి(Varanasi) షూటింగ్ కీలక దశకు చేరుకుంది. గత కొన్ని నెలలుగా భారీ యాక్షన్ ఎపిసోడ్లను పూర్తి చేసిన మేకర్స్, జూలై 8 నుంచి కొత్త షెడ్యూల్‌ను ప్రారంభించింది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీ(RFC)లో సినిమా కథలో అత్యంత ప్రాధాన్యం ఉన్న అఘోరా నేపథ్య సీన్స్‌ను చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం వారణాసి నగర వాతావరణాన్ని ప్రతిబింబించేలా స్పెషల్ సెట్లు నిర్మించగా, వందలాది మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొంటున్నారు. ఈ ఎపిసోడ్ కథలో కీలక మలుపుగా నిలుస్తుందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.
ఇటీవల ఫ్రాన్స్ పర్యటనలో రాజమౌళి సినిమా నిర్మాణ పురోగతిపై ఆసక్తికర విషయాలు వెల్లడించారు. సినిమాకు సంబంధించిన ప్రధాన ఐమాక్స్ యాక్షన్ సీక్వెన్స్‌లన్నీ ఇప్పటికే పూర్తయ్యాయని, ఇప్పుడు కథను మరింత బలంగా ముందుకు తీసుకెళ్లే భావోద్వేగ, డ్రామాటిక్ సీన్స్ పై దృష్టి పెట్టామని తెలిపారు. ఇంకా సుమారు 80 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉందని, సెప్టెంబర్ లేదా అక్టోబర్ నాటికి మొత్తం షూటింగ్ పూర్తయ్యేలా ప్లాన్ రూపొందించినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా, ప్రియాంక చోప్రా(Priyanka Chopra) పుట్టినరోజు సందర్భంగా ఆమె పోషిస్తున్న మందాకిని(Mandakini) పాత్ర ఫస్ట్ లుక్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ప్రియాంక స్పందిస్తూ, వారణాసి అనేది పలు దేశాలు, భిన్న కాలపరిమితులను కలిపే విశాలమైన అడ్వెంచర్ కథ అని, ఇందులో భారీ స్థాయి యాక్షన్ ఎపిసోడ్లు ఆడియన్స్ ను ఆకట్టుకుంటాయని పేర్కొన్నారు. మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్(Prithvi raj sukumaran) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరుగుతున్నాయి.








