ఊ అంటావా లాంటి పాటలు చేయలేను: కృతి శెట్టి
‘పుష్ప’ సినిమాలో సమంత చేసిన ‘ఊ అంటావా మావా.. ఊహూ అంటావా మావా’ పాట ఒక సెన్సేషన్. ఈ పాట రిలీజైనపుడు సోసోగా అనిపించినా.. తర్వాత అది ఒక ఊపు ఊపేసింది. ఆడియో పరంగా ఈ పాట రేపిన సంచలనం ఒకెత్తయితే.. వీడియో పరంగా క్రియేట్ చేసిన సెన్సేషన్ ఇంకో ఎత్తు. ఈ సాంగ్‌లో సమంత నెవర్ బిఫోర్ అన్నట్లుగా హాట్ హాట్‌గా కనిపించి యూత్‌కు బాగా మత్తెక్కించింది.
కెరీర్లో చాలా వరకు ట్రెడిషనల్ పాత్రలే చేసిన సమంతను ఈ సాంగ్‌లో అంత సెక్సీగా చూసి అందరూ షాకయ్యారు. స్టార్ హీరోయిన్లు అలా కనిపించడానికి మామూలుగా ఒప్పుకోరు. ఈ సాంగ్‌ను వేరే స్టార్ హీరోయిన్లకు ఆఫర్ చేస్తే ఒప్పుకునే వాళ్లో లేదో కూడా డౌటే. రీసెంట్గా ఈ విషయమై ఉప్పెన హీరోయిన్ కృతి శెట్టిని అడిగితే అలాంటి పాటలు చేయడం తన వల్ల కాదని, తనకు ఆ పాటలు సూట్ కావని తేల్చి చెప్పేసింది.
ఊ అంటావా లాంటి పాటలకు చేయమని నన్నడిగితే ప్రస్తుతానికి అలాంటివి అంగీకరించే స్థితిలో లేనని, అలాంటి పాటలు ఎలా చేయాలన్న అవగాహన కూడా నాకు లేదు. నాకు సౌకర్యంగా అనిపించనప్పుడు ఏదీ చేయలేను. నాకు ఊ అంటావా సాంగ్ ఇష్టమే. అందులో సమంత అద్భుతంగా డ్యాన్స్ చేశారు. ఆమె ఫైర్ అని చెప్పింది కృతి.
శ్యామ్ సింగరాయ్ లో లిప్ లాక్, ఇంటిమేట్ సీన్లు చేయడానికి తాను బాగా ఇబ్బంది పడినట్లు కూడా కృతి చెప్పుకొచ్చింది. ఆ సినిమాలో కొన్ని రొమాంటిక్ సీన్లలో తాను వంద శాతం మనస్పూర్తిగా నటించలేకపోయినట్లు, హార్ట్‌ఫుల్‌గా చేయలేననిపించనప్పుడు వాటిని వదిలేయడమే బెటర్ అనే విషయాన్ని అప్పుడే తెలుసుకున్నట్లు కృతి చెప్పింది. కృతి నటించిన కస్టడీ ప్రస్తుతం థియేటర్లలో ఉంది.













