ఓటీటీ ప్లాట్‌ఫాంలోకి మరో తెలుగు సినిమా..!
కరోనా రోజు రోజుకి మరింత విజృంభిస్తుండడం, దీంతో లాక్డౌన్ క్రమక్రమేపీ పెరగుతూ పోతుండడం నిర్మాతల గుండెల్లో గుబులు పుట్టిస్తుంది. ఇప్పట్లో థియేటర్స్ కూడా తెరచుకునే పరిస్థితులు లేకపోవడంతో రిలీజ్‌కి సిద్ధంగా ఉన్న సినిమాలని మెల్లమెల్లగా ఓటీటీలో విడుదల చేసేలా టాలీవుడ్ నిర్మాతలు పావులు కదుపుతున్నట్టు తెలుస్తుంది.
ఇప్పటికే అమృతరామమ్ అనే తెలుగు చిత్రం ఓటీటీలో విడుదల కాగా, ఇప్పుడు క్షణం ఫేమ్ రవికాంత్ తెరకెక్కించిన ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ అనే చిత్రం జీ 5లో డైరెక్ట్‌గా విడుదల కానుందని అంటున్నారు. గతేడాది ఆగష్టులోనే షూటింగ్ ముగించుకున్న సినిమా ఇంతవరకు రిలీజ్ కి నోచుకోలేదు. రానున్న రోజులలో పరిస్థితులు కూడా అనుకూలంగా కనిపించకపోవడంతో ఓటీటీలో విడుదల చేయడమే ఉత్తమమని భావిస్తున్నారు నిర్మాతలు. గుంటూరు టాకీస్ ఫేమ్ సిద్ధు హీరోగా నటించిన ఈ చిత్రంలో శ్రద్ధ శ్రీనాథ్ షాలిని, సీరత్ కపూర్ కథానాయికలుగా నటించారు. సురేష్ ప్రొడక్షన్స్‌తో కలిసి బాలీవుడ్ నిర్మాణ సంస్థ వయాకామ్ 18 ఈ చిత్రాన్ని నిర్మించింది.






