ఎన్టీర్ #30 లో హీరోయిన్ గా ‘మహానటి’ కీర్తి సురేష్?
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ తన తదుపరి కెరీర్ 30వ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కిన అరవింద సమేత సినిమాతో మంచి సక్సెస్ ని అందుకున్న ఎన్టీఆర్, ప్రస్తుతం నటిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం పాత్ర పోషిస్తుండగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. డివివి దానయ్య అత్యంత భారీ ఖర్చుతో అత్యున్నత సాంకేతిక విలువలతో నిర్మిస్తున్న ఈ సినిమాలో అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్స్ గా నటిస్తుండగా కీరవాణి సంగీతాన్ని, సెంథిల్ కుమార్ ఫోటోగ్రఫిని అందిస్తున్నారు. సముద్రఖని, రాహుల్ రామకృష్ణ, అజయ్ దేవగన్, శ్రీయ శరణ్ తదితరులు కీలక పత్రాలు పోషిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇక దీని అనంతరం ‘అయినను పోయి రావలె హస్తినకు’ అనే టైటిల్ ఈ సినిమాకు పరిశీలనలో ఉన్నట్లు ఇటీవల కొన్నాళ్లుగా పలు మీడియా మాధ్యమాల్లో వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఎన్టీఆర్ ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ పాత్ర పోషించనున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమాని అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా పలు ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు అన్ని రకాల కమర్షియల్ హంగులు కలగలిపి దీనిని త్రివిక్రమ్ తీయనున్నట్లు చెప్తున్నారు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన రాగా దీనిని ఎన్టీఆర్ ఆర్ట్స్, హారికా హాసిని క్రియేషన్స్ సంస్థలు కలిసి ఎస్.రాధాకృష్ణ (చినబాబు), నందమూరి కళ్యాణ్ రామ్ సంయుక్తంగా అత్యంత భారీ ఖర్చుతో నిర్మించనున్నాయి.
కాగా ఈ సినిమాకి ఎస్ ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తుండగా ఇందులో ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా ప్రముఖ నటి కీర్తి సురేష్ నటించనున్నట్లు లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్. వాస్తవానికి పలువురు హీరోయిన్స్ పేర్లు ఇటీవల తెరపైకి రాగా ఎట్టకేలకు నేడు ఈ సినిమా హీరోయిన్ గా కీర్తి ని ఫైనల్ చేసిందట మూవీ యూనిట్. అలానే ఆమె కాల్షీట్స్ కూడా తీసుకున్నారని, అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి తరువాత పట్టాలెక్కనున్నట్లు టాక్. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమే అయితే తొలిసారిగా ఎన్టీఆర్, కీర్తి సురేష్ ల కాంబినేషన్ చూస్తామన్నమాట!!!













