ఈ పుట్టినరోజు కానుక అదే!
సినిమా హీరోల పుట్టినరోజులు వస్తున్నాయంటే వారి కుటుంబ సభ్యులు, స్నేహితుల ఆనందం కంటే అభిమానుల హడావిడే ఎక్కువగా ఉంటుంది. దాదాపు అందరు హీరోల అభిమానులు అలాగే ఉంటారు. తమ అభిమాన హీరో పుట్టినరోజు నాడు వివిధ ప్రదేశాల నుంచి హైదరాబాద్ చేరుకుంటారు. ఆ హీరో పుట్టినరోజును దగ్గరుండి జరిపిస్తారు. ఇది ఎప్పటి నుంచో ఆనవాయితీగా వస్తున్నదే. అయితే ఒక్కోసారి ఆయా హీరోలు విదేశాల్లోనో, ఇతర రాష్ట్రాల్లోనో షూటింగ్లో ఉండిపోవడంతో పుట్టినరోజులు ఘనంగా జరగవు. మరి ఇప్పటి పరిస్థితి ఏమిటి.. ఎవరూ ఇంటి నుంచి బయటికి కదిలే అవకాశం లేదు. దూర ప్రాంతాల నుంచి హైదరాబాద్ వచ్చే సదుపాయం కూడా లేదు. ఈ నేపథ్యంలోనే హీరో ఎన్టీఆర్ పుట్టినరోజు వచ్చింది. మే 20 ఎన్టీఆర్ పుట్టినరోజు.
ప్రతి సంవత్సరం ఎన్టీఆర్ పుట్టినరోజును అభిమానులు ఘనంగా నిర్వహిస్తారు. గత సంవత్సరం తన తండ్రి హరికృష్ణ హఠాన్మరణంతో తన పుట్టినరోజును జరుపుకోవడానికి ఎన్టీఆర్ తిరస్కరించారు. ఈ సంవత్సరం మాత్రం కరోనా ఎన్టీఆర్ పుట్టినరోజును అడ్డుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కడెక్కడి నుంచో అభిమానులు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఏడాదైనా తమ అభిమాన హీరో పుట్టినరోజును ఘనంగా జరపాలని భావిస్తున్నారు. మే 17 వరకు కేంద్రం లాక్డౌన్ ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మే 29 వరకు లాక్డౌన్ కొనసాగుతుందని తెలియజేసింది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ తన పుట్టినరోజు వేడుకను తిరస్కరిస్తారని తెలుస్తోంది. ఈ పుట్టినరోజుకు రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలోని ఎన్టీఆర్ లుక్‌ని విడుదల చేస్తారని సమాచారం. ఎన్టీఆర్ అభిమానులకు ఎన్టీఆర్ ఇచ్చే పుట్టినరోజు కానుక అదే అవుతుంది.













