ఎన్టీఆర్ బాలీవుడ్ ప్లాన్ వర్కవుట్ అవుతుందా?
బాలీవుడ్లో హీరోగా వెలిగిపోవాలని ఎంతోమంది సౌత్ హీరోలు కలలు కన్నారు. కొంతమంది ప్రయత్నించి విఫలమయ్యారు. కొందరు ఫర్వాలేదు అనిపించుకున్నారు. సౌత్ నుంచి బాలీవుడ్‌కి హీరోలుగా వెళ్లిన వారిలో రజనీకాంత్, కమల్‌హాసన్, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్‌లను ప్రధానంగా చెప్పుకోవచ్చు. వీరు అడపా దడపా హిందీ సినిమాలు చేసినా పూర్తి స్థాయి హీరోలుగా పేరు తెచ్చుకోలేకపోయారు. ఇది ఎప్పటి నుంచో జరుగుతున్నదే. ఇక హీరోయిన్ల విషయానికి వస్తే శ్రీదేవి ఒక్కరే సౌత్ నుంచి వెళ్లిన హీరోయిన్లలో టాప్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది.
ఈమధ్యకాలంలో మన హీరోలెవరూ అలాంటి ప్రయత్నం చేయడం లేదు. `బాహుబలి`తో ప్రభాస్ హిందీలో ఎంట్రీ ఇచ్చినా అది అనువాద చిత్రం. పాన్ ఇండియా మూవీగా బాహుబలి విడుదలై ఘనవిజయం సాధించడంతో ఇప్పుడు కొత్తగా వస్తున్న టాప్ హీరోల సినిమాలన్నీ వివిధ భాషల్లో రిలీజ్ చేయడానికి అనుకూలంగా ఉండేలా చూసుకుంటున్నారు. స్ట్రెయిట్ సినిమాతో ఎంట్రీ ఇవ్వలేకపోయినా డబ్బింగ్ ద్వారా హిందీ ప్రేక్షకుల్ని కూడా పలకరిస్తున్నారు తెలుగు హీరోలు.
తాజాగా ఎన్టీఆర్ బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. ఇది పాన్ ఇండియా సినిమా కావడం వల్ల హిందీలో కూడా రిలీజ్ అవుతుంది. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత హిందీలో డైరెక్ట్ సినిమా చెయ్యాలని భావిస్తున్నాడు ఎన్టీఆర్. ఆర్ ఆర్ ఆర్ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో తన 30వ సినిమా చేస్తున్నాడు ఎన్టీఆర్. ఆ సినిమా తర్వాత తన 31వ సినిమాను కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేయబోతున్న విషయం తెలిసిందే. ఇది కూడా పాన్ ఇండియా సినిమాగా రూపొందనుంది. అయితే ఈ సినిమాను హిందీలో డబ్బింగ్ వెర్షన్ కాకుండా స్ట్రెయిట్ సినిమాగా తీసి రిలీజ్ చెయ్యాలన్నది ఎన్టీఆర్ ప్లాన్. తన ప్లాన్‌ని డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌కి కూడా వివరించాడు ఎన్టీఆర్. బాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వడానికి ఇదే సరైన సినిమా అని కూడా ఎన్టీఆర్ భావిస్తున్నాడని సమాచారం.













