ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర వాణిజ్యమండలి దశాబ్ది వేడుకలకు సర్వం సిద్ధం.. ఆవిష్కృతం కానున్న చారిత్రక ఘట్టం
గత పదేళ్లుగా తెలుగు చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం, కార్మికుల సంక్షేమం కోసం ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్న ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర వాణిజ్యమండలి(APFCC) దశాబ్ది వేడుకలకు సర్వం సిద్ధమైంది. అక్టోబర్ 4వ తేదీ, 2026 సాయంత్రం 6 గంటల నుంచి ఈ ప్రతిష్టాత్మక దశాబ్ది వేడుకలు ప్రారంభం కానున్నాయి. విజయవాడ, గుంటూరు జాతీయ రహదారిలో ఆత్మకూరు సమీపంలో ఉన్న ‘హ్యాపీ రిసార్ట్స్’ ఈ చారిత్రక వేడుకకు వేదికగా నిలవనుంది. గత దశాబ్ద కాలంలో చిత్ర పరిశ్రమ సాధించిన విజయాలను గుర్తుచేసుకుంటూనే, రాబోయే రోజుల్లో నవ్యాంధ్రలో సినీ పరిశ్రమను మరింతగా ఎలా అభివృద్ధి చేయాలి అనే విషయాలను ఈ వేదికపై ప్రత్యేకంగా చర్చించనున్నారు.
ప్రభుత్వ పెద్దల హాజరు.. పరిశ్రమకు కొండంత భరోసా
ఈ అద్భుతమైన కార్యక్రమానికి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. ప్రభుత్వ పెద్దలు స్వయంగా ఈ కార్యక్రమానికి రానుండటంతో చిత్ర పరిశ్రమ వర్గాల్లో తీవ్ర ఉత్సాహం నెలకొంది. ఈ వేడుక ద్వారా ప్రభుత్వానికి, చిత్ర పరిశ్రమకు మధ్య మరింత బలమైన బంధం ఏర్పడే దిశగా అడుగులు పడతాయని పరిశ్రమ వర్గాలు బలంగా విశ్వసిస్తున్నాయి. చలనచిత్ర రంగానికి సంబంధించిన మౌలిక సదుపాయాల కల్పన తదితర అంశాలపై ఈ వేదికగా కీలక చర్చలు జరిగే అవకాశం ఉంది.
ప్రతిభకు పట్టాభిషేకం.. సీనియర్లకు సత్కారం
ఈ దశాబ్ది వేడుకలో సినీ పరిశ్రమకు విశేష సేవలు అందించిన ప్రముఖులను, సీనియర్ కళాకారులను ఘనంగా సత్కరించనున్నారు. ప్రత్యేకంగా ఎంపిక చేసిన ఆరుగురు సీనియర్ సినీ ప్రముఖులకు ఈ వేదికపై ప్రతిష్టాత్మక అవార్డుల ప్రదానం జరగనుంది. జాతీయ స్థాయిలో ఉత్తమ తెలుగు చిత్రాలుగా ఎంపికైన సినిమా బృందాలకు ప్రత్యేక సన్మానం జరగనుంది. ఎంతో మంది కొత్త ప్రతిభావంతులను ప్రోత్సహించే ఉద్దేశంతో షార్ట్ ఫిల్మ్ విజేతలకు కూడా అవార్డులు అందజేయనున్నారు. సినిమాను ప్రేక్షకులకు చేరవేయడంలో అహర్నిశలు శ్రమించే సీనియర్ ఎగ్జిబిటర్లకు , డిస్ట్రిబ్యూటర్లకు ఈ దశాబ్ది వేడుకల్లో ప్రత్యేక సత్కారం జరగడం విశేషం.
వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా తారలు…
ఈ వేడుకల్లో ప్రముఖ నటీమణులు లయ, నిహారిక కొణిదెల, అమెరికాకు చెందిన జో శర్మ తదితరులు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నారు. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుత విజయం సాధించిన ‘కమిటీ కుర్రోళ్లు’, ’35’, ‘లిటిల్ హార్ట్స్’ వంటి చిత్రాల బృందాలు ఈ వేదికపై ప్రత్యేక గుర్తింపు పొందనున్నాయి. మంచి కంటెంట్ ఉన్న చిన్న సినిమాలకు వాణిజ్యమండలి ఇస్తున్న ప్రాధాన్యతను ఈ కార్యక్రమం స్పష్టం చేయనుంది.
గత సమావేశాల స్ఫూర్తితో…
గతంలో జరిగిన ఎన్నో ముఖ్యమైన సమావేశాలు సినీ పరిశ్రమలోని ఎన్నో క్లిష్టమైన సమస్యలను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషించాయి. నటీనటులు, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఎదుర్కొంటున్న అనేక ఇబ్బందులను గత సమావేశాల ద్వారా వాణిజ్యమండలి విజయవంతంగా పరిష్కరిస్తూ వస్తోంది. థియేటర్ల మనుగడ, చిన్న సినిమాల విడుదల లాంటి ఎన్నో సమస్యలపై ప్రభుత్వంతో చర్చించి సానుకూల నిర్ణయాలు తీసుకురావడంలో ఈ సంస్థదే ప్రధాన పాత్ర. ఆ విజయాల స్ఫూర్తితోనే ఇప్పుడు పదేళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకుని ఈ దశాబ్ది వేడుకలను ఒక పండుగ వాతావరణంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు.








