వివి వినాయక్ చేతులమీదుగా దమ్కీ టీజర్
రజిత్, త్రిషా లాషా జంటగా ఏనుగంటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం దమ్కీ. సత్యనారాయణ సుంకర నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌లో ఈ సినిమా టీజర్‌ని, నిర్మాణ సంస్థ లోగోని దర్శకుడు వి.వి.వినాయక్ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సుంకర బ్రదర్స్ మా కుటుంబానికి కావాల్సినవాళ్లు. వాళ్ల తమ్ముడికి మంచి జీవితాన్ని ఇవ్వాలని ఈ సంస్థని స్థాపించారు. కుటుంబ విలువలకి ప్రాధాన్యం ఇచ్చే సుంకర బ్రదర్స్, ఇంటిల్లిపాదికీ నచ్చేలాగే ఈ సినిమాని తీసుంటారని నమ్ముతున్నా. దమ్కీ మంచి చిత్రంగా ప్రేక్షకుల మెప్పు పొంది, ఈ సంస్థకి మంచి పునాదిగా నిలవాలని ఆకాంక్షిస్తున్నా అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ యాక్షన్ ప్రధానంగా సాగే చిత్రమిది. ఇందులో ఎవరికి ఎవరు దమ్కీ ఇచ్చారన్నది ఆసక్తికరం. ఇది నా రెండో సినిమా. అన్ని వర్గాల ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతుంది అన్నారు. కథాబలమున్న చిత్రమిది, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామన్నారు నిర్మాత. ఈ కార్యక్రమంలో అభిలాష్‌తో పాటు చిత్రబృందం పాల్గొంది.













