బన్నీ…బుట్టబొమ్మగా పారుల్ హల్చల్
కొన్ని సినిమాలంతే… వచ్చి కొన్ని నెలలైనా జనాన్ని ఏదో ఒక రూపంలో పలకరిస్తూనే ఉంటాయి. మరీ ముఖ్యంగా సోషల్ మీడియా యుగంలో ఒక హిట్ సినిమా మరెన్నో హిట్స్ దక్కించుకోవడానికి అవకాశాలూ పెరిగాయి. అల వైకుంఠ పురంలో సినిమా అల్లు అర్జున్, త్రివిక్రమ్‌ల కెరీర్ హిట్ అనేది తెలిసిందే. ఆ సినిమా రాకముందే సామజవర గమన పాట సోషల్ మీడియాలో దుమ్ము రేపేసింది. సాక్షాత్తూ తెలంగాణ మంత్రి కెటియార్ కూడా ఆ పాట తనను వదలడం లేదంటూ ట్వీట్ చేశారు. విచిత్రంగా… సినిమా విడుదలైన తర్వాత బుట్ట బొమ్మా బుట్ట బొమ్మా పాట సూపర్ హిట్టయింది.
ఈ పాటలో బన్నీ, పూజా హెగ్డే వేసిన స్టెప్పులు నవతరం డ్యాన్సర్లనూ, అప్ కమింగ్ ఆర్టిస్టులనూ కదిలించి కవర్ సాంగ్స్ చేసేలా ఊపు తెప్పించాయి. ఇప్పటికీ ఆ ఊపు కొనసాగుతూనే ఉంది. తాజాగా సినీనటి పారుల్ యాదవ్ కు కూడా బుట్ట బొమ్మ పాట విపరీతంగా నచ్చేసింది. దీంతో టిక్ టాక్ వీడియో కూడా చేసేసింది ఇప్పుడా పాట సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. మొత్తం మీద సినిమా నటిగా ఇంకా పెద్ద పాప్యులర్ కాని పారుల్ ఈ పాటతో నెటిజన్లకు బాగానే చేరువయ్యింది.













