తెలంగాణ మట్టి వాసనతో భోగి తొలి సాంగ్.. గతంలోకి తీసుకెళ్తున్న ఎగిలి వరంగ
శర్వానంద్(Sharwanand), అనుపమ పరమేశ్వరన్(Anupama parameswaran) జంటగా నటిస్తున్న పీరియాడిక్ డ్రామా భోగి నుంచి రిలీజైన ఫస్ట్ సాంగ్ ఎగిలి వరంగ(egili varanga) ఆడియన్స్ లో ఆసక్తిని పెంచుతోంది. 1960ల నాటి తెలంగాణ జీవనశైలిని స్క్రీన్‌పై ఆవిష్కరించే ప్రయత్నంలో ఈ సాంగ్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తోంది. సంపత్ నంది(Sampath nandi) రచన, దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను కేకే రాధామోహన్(KK Radhamohan) భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. నవంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా సినిమా రిలీజ్ కానుంది.
ఒకప్పటి తెలంగాణ పల్లెలు, అక్కడి ప్రజల జీవన విధానం, వారి ఎమోషన్స్ ను ప్రతిబింబించేలా సాంగ్ ను తీర్చిదిద్దారు. అప్పటి కాలానికి అద్దం పట్టేలా రూపొందించిన సెట్స్, కళా రూపకల్పన, విజువల్స్ కథా ప్రపంచంలోకి ప్రేక్షకులను తీసుకెళ్తున్నాయి. కేవలం సాంగ్ గా కాకుండా, సినిమా నేపథ్యాన్ని, అందులోని క్యారెక్టర్ల జీవితాలను పరిచయం చేసే ప్రయత్నంగా ఎగిలి వరంగ కనిపిస్తోంది. చంద్రబోస్(chandra bose) సాహిత్యం, భీమ్స్ సిసిరోలియో(bheems Ciciroleo) మ్యూజిక్ సాంగ్ కు సహజత్వాన్ని తీసుకొచ్చాయి. నల్గొండ గద్దర్ నరసన్న(Gaddar Narasanna), రిలారే గోపాల్(Relare Gopal), నర్సిరెడ్డి(narsi reddy), కందుకూరి శంకర్ బాబు(kandukuri sankar babu) గాత్రాలు తెలంగాణ జానపద మట్టి వాసనను మరింతగా పలికించాయి.
సాధారణంగా తన చార్మింగ్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకునే శర్వానంద్ ఈ సినిమాలో పూర్తిగా భిన్నమైన, డీగ్లామరైజ్డ్ లుక్‌లో కనిపిస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్ కూడా కథా కాలానికి తగిన పాత్రలో ఒదిగిపోయినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే రిలీజైన టీజర్లో కనిపించిన సంఘర్షణ, ఎమోషన్స్ కు ఈ సాంగ్ మరింత బలాన్ని చేకూరుస్తోంది. తెలంగాణ సంస్కృతి, గ్రామీణ నేపథ్యం, మనుషుల జీవితాలను కథలో కీలకంగా మలిచినట్లు కనిపిస్తున్న భోగిపై మొదటి సాంగ్ అంచనాలను పెంచుతోంది.








