మహేష్ నో.. బన్నీ యస్!
ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏ హీరో, ఏ దర్శకుడితో ఎప్పుడు చేస్తాడో ఎవరూ ఊహించలేరు. కొందరు డైరెక్టర్లు ఓ హీరోతో ట్రావెల్ అవుతూ, మరో హీరోతో సినిమాను సెట్ చేసుకోవడం కొత్తేమీ కాదు. ఎప్పటినుంచో అందరూ చూస్తున్న విషయమే. రీసెంట్గా మహేష్ బాబుతో సినిమా చేయాలనుకునే దర్శకులంతా బన్నీ వైపు అడుగులేస్తున్నారు.
దానికి ఎగ్జాంపుల్ అంటే సుకుమార్, సందీప్ రెడ్డి వంగా. వాస్తవానికి సుకుమార్ పుష్ప కంటే ముందు మహేష్ తో సినిమా చేయాలనుకున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో ఈ మూవీ అనౌన్స్ మెంట్ కూడా వచ్చింది. కానీ ఏం జరిగిందో ఏంటో తెలియదు, కొన్ని క్రియేటివ్ డిఫెరెన్సెస్ వల్ల సినిమా క్యాన్సిల్ అయిందంటూ మహేష్ ట్వీట్ చేశాడు.
ఆ తర్వాత వెంటనే సుక్కూ, బన్నీకి స్టోరీ చెప్పి, వెంటనే సినిమాను అనౌన్స్ చేశాడు. రీసెంట్గా సందీప్ రెడ్డి వంగా విషయంలోనూ అదే జరిగింది. కాకపోతే సందీప్ విషయంలో అనౌన్స్ చేసి క్యాన్సిల్ చేయడం లాంటివేమీ లేవు. అర్జున్ రెడ్డి రిలీజ్ తర్వాత నుంచి సందీప్, మహేష్ తో ట్రావెల్ చేస్తూనే ఉన్నాడు. మహేష్ ఫ్యాన్స్ మొన్నటి వరకు వీరిద్దరి కాంబోలో సినిమా వస్తుందని ఆశపడ్డారు కూడా.
కానీ మహేష్ సందీప్ ను కూడా వదులుకున్నాడు. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగా, బన్నీతో సినిమాను అనౌన్స్ చేసుకున్నాడు. సందీప్ మహేష్ కు చాలానే కథలు చెప్పాడు. కానీ ఏదీ అనౌన్స్ మెంట్ వరకు రాలేదు. సందీప్ బాలీవుడ్ సినిమాతో బిజీ అవడం కూడా మహేష్ చేసిన దానికి కారణమై ఉండొచ్చు. తర్వాత, మహేష్ త్రివిక్రమ్ ప్రాజెక్ట్ తర్వాత రాజమౌళితో సినిమా చేయనుండటంతో, సందీప్ బన్నీని కాంటాక్ట్ అయుండొచ్చు. ఏదేమైనా మహేష్ వదులుకున్న డైరెక్టర్లంతా బన్నీ దగ్గరకు క్యూ కడుతున్నారు.













