చైనాకు బుద్ది చెప్పేందుకు ఇదే సరైన మార్గం!
నిన్న కరోనా… నేడు సరిహద్దు రగడ… ఈ రెండు అంశాలతో భారతీయులంతా చైనా దేశంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చైనా ఎంత మొసలి కన్నీరు కార్చినా కరోనా వ్యాప్తికి ముమ్మాటికీ ఆ దేశమే కారణం. ఇది మన దేశం కాదు.. ప్రపంచదేశాలన్నీ చెబుతున్న మాట. ఈ కారణంగానే చాలా దేశాల్లో చైనా ఉత్పత్తుల వాడకం బాగా తగ్గింది. ఎన్నో దేశాలు చైనాతో తమకు ఉన్న ఆర్థిక లావాదేవీలను రద్దు చేసుకున్నాయి. కరోనా సమస్య సమసిపోకుండానే ఇప్పుడు భారత సరిహద్దులో విధ్వంసం సృష్టిస్తోంది చైనా. నిబంధనలు తుంగలో తొక్కి ఆ దేశ సైన్యం సరిహద్దుల్లో మన సైన్యంపై దాడులకు తెగపడుతోంది. ఈ చర్యలతో భారతీయులంతా చైనాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చైనాకి సంబంధించిన ఎన్నో ఉత్పత్తులను భారతీయులు గత కొన్ని సంవత్సరాలుగా ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు వాటికి చెక్ పెట్టాలని నిర్ణయించుకుంటున్నారు. ఇకపై చైనావస్తువులు వాడకూడదన్న అభిప్రాయం అందరిలోనూ వ్యక్తమవుతోంది. అందులో భాగంగానే నటి సాక్షి అగర్వాల్ ఒక అడుగు ముందుకు వేసి చైనా వస్తువులను వాడకుండా ఉండడమే కాదు, ఆయా వస్తువుల వ్యాపార ప్రకటనల్లో కూడా తాను ఇకపై నటించబోనని ప్రకటించింది. దీనిపై ఆమె స్పందిస్తూ.. “శాంతికి, సహనానికి మారు పేరు భారతదేశం. కరోనాతో ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసిందే కాక ఇప్పుడు మన దేశం సరిహద్దు ప్రాంతాలను ఆక్రమించుకోవాలని చూస్తోంది. ఆ క్రమంలోనే మన సైనికులపై దాడి చేసి ఎంతోమంది సైనికుల ప్రాణాలు బలిగొంది. దీన్ని ఎంతో తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉంది. నావరకు నేను ఇకపై చైనా వస్తువులను నిషేధించడమే కాదు, ఆ దేశ ఉత్పత్తులకు సంబంధించిన వ్యాపార ప్రకటనల్లో కూడా నటించకూడదని నిర్ణయించుకున్నాను“ అని తెలిపింది.













