కూకట్ పల్లి బరిలో సినీ నటుడు
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కూకట్పల్లి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగుతానని నిర్మాత, దర్శకుడు జీవీ సుధాకర్ నాయుడు అన్నారు. కేపీహెచ్బీలో వినాయక మండపాల్లో నిర్వహించిన పూజల్లో పాల్గొన్నారు. అనంతరం ధర్మారెడ్డికాలనీ ఫేజ్-1లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఐ లవ్ కూకట్పల్లి పేరుతో ప్రచారం చేపట్టి నియోజకవర్గంలోని ప్రజలందరిని కలవనున్నట్లు తెలిపారు. తన రాజకీయ భవిష్యత్తుపై త్వరలోనే పూర్తిస్థాయిలో సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించనున్నట్లు ప్రకటించారు. కులాలు, మతాల పేరుతో ప్రజలను ఓట్ల కోసం విభజించి పాలిస్తున్న పాలకులకు తగిన గుణపాఠం చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో పాలన సాగిస్తున్న పార్టీలు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేకపోయాయన్నారు. ఏదో ఒక పార్టీ లేదా, స్వతంత్య్ర అభ్యర్థిగా అయినా ఈసారి కూకట్పల్లి నుంచి పోటీ చేస్తానని తెలిపారు. తెలంగాణలో జనసేన పార్టీ పోటీ చేస్తే మాత్రం ఆ పార్టీ తరపున నిలబడుతానని తెలిపారు.













