హీరో రామ్కి షాక్ ఇచ్చిన విజయవాడ పోలీసులు!
విజయవాడ స్వర్ణ ప్యాలెస్లో జరిగిన అగ్నిప్రమాదం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. దీన్ని సీరియస్గా తీసుకున్న ప్రభుత్వం విచారణ ముమ్మరం చేసింది. దీంతో పోలీసులు కొన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ హాస్పిటల్ ప్రమాదం విచారణలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు గురించి, రాష్ట్ర ప్రభుత్వ తీరు గురించి హీరో రామ్ ఇటీవల కొన్ని కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. దానికి విజయవాడ పోలీసులు సరైన సమాధానం చెప్పారు. ఈ కేసు విచారణకు ఆటంకం కలిగిస్తే హీరో రామ్కి కూడా నోటీసులు జారీ చేస్తామని హెచ్చరించారు.
ఈ విషయమై ఎసిపి సూర్యచంద్రరావు మాట్లాడుతూ “రమేశ్ హాస్పిటల్ యాజమాన్య వ్యవహారాన్ని చాలా సీరియస్గా తీసుకుంటున్నాం. ఇప్పటి వరకు డాక్టరు మమత, సౌజన్యను విచారించాం. విచారణకు ఆటంకం కలిగిస్తే హీరో రామ్కి కూడా నోటీసులిస్తాం. రమేష్ అల్లుడు కళ్యాణ్ చక్రవర్తి ఈరోజు విచారణకు రావాలి. ఆరోగ్యం బాగోలేదు రెండు వారాలు క్వారంటైన్లో ఉండాలని మెయిల్ చేశారు.ఆయన సోదరుడు ఆరోగ్యం బాగోలేదని, ఇంట్లోనే అందుబాటులో ఉంటానని చెప్పారు. విచారణకు ఇంటికే రమ్మన్నారు. నిజంగా ఆరోగ్యం బాగాలేదా లేక నోటీసులు తీసుకుని విచారణకు ఆటంకం కలిగించడానికి ఈవిధంగా చేస్తున్నారా అన్నది పరిశీలిస్తున్నాం. వృద్దాప్యంలో ఉన్నవారు విచారణకు రాలేకపోతే ఇంటికికే వెళ్లి విచారిస్తాం..మిగిలిన వారు తప్పకుండా విచారణకు హాజరు కావాల్సిందే.. ప్రమాదానికి పూర్తి బాధ్యత ఎవరిది అన్నది దర్యాప్తులో తేలుతుంది. రమేష్ కలెక్టర్ కార్యాలయానికి వచ్చి అక్కడి నుంచి పరారయ్యారు. సెల్ స్విచ్ ఆఫ్ చేసి, సొంత కారును అక్కడే వదిలేసి మరో కారులో వెళ్లిపోయారు. ఆయన కుటుంబ సభ్యులు కూడా లేరు. పరారీలో ఉండి దొంగచాటుగా ఆడియో టేపు విడుదల చేసి విచారణకు సహకరిస్తామని చెప్పడం సరికాదు.
నేడు 91 సీఆర్పీసీ కింద ఆయన వద్ద ఉన్న డాక్యుమెంట్లను తీసుకు రావాలని నోటీసు ఇస్తాం. ఆక్సిజన్ సిలిండర్లు, ఫార్మసీ వంటి వాటికి ఏయే ఎంవోయూ చేసుకున్నారో మాకు తెలియజేయాలి. హోటల్ వేరు, కోవిడ్ కేర్ సెంటర్ వేరు. ఇందులో పేషెంట్స్ ఉంటారు బట్టి.. ప్రతి అంతస్తుకు ఒక సెక్యూరిటీ గార్డ్ ఉండాలి. స్వర్ణ ప్యాలస్, రమేష్ ఆసుపత్రి మధ్య ఎలాంటి అగ్రిమెంట్ జరిగిందో ఇప్పటి వరకు మాకు చూపించలేదు. దీనిపై ఆయనకు అవగాహన లేదనిపిస్తుంది. క్వారంటైన్ వేరు, కొవిడ్ కేర్ సెంటర్ వేరు.. ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి. విచారణకు ఎవరు ఆటంకం కలిగించినా నోటీసులు ఇస్తాం.’ అని తెలిపారు.













