పవన్ కళ్యాణ్‌కు సర్జరీ.. నాలుగు వారాలు పూర్తి విశ్రాంతి!
టాలీవుడ్ స్టార్ హీరో, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(pawan kalyan) మెడికల్ ట్రీట్మెంట్ కోసం రేపు ముంబైకి వెళ్లనున్నారు. ఇటీవల నిర్వహించిన మెడికల్ టెస్టుల్లో రెండు భుజాల కండరాలు, రొటేటర్ కఫ్ భాగాల్లో ట్రీట్మెంట్ అవసరమయ్యే స్థాయిలో సమస్య ఉన్నట్లు డాక్టర్లు నిర్ధారించినట్టు సమాచారం. వెంటనే ఆపరేషన్ చేయించుకోవాలని సూచించినప్పటికీ, ప్రభుత్వ బాధ్యతలు, అధికారిక కార్యక్రమాలు వరుసగా ఉండటంతో ఆయన ఆ డెసిషన్ ను కొంతకాలం వాయిదా వేసుకున్నారు. ఇప్పుడు అధికారిక షెడ్యూల్‌కు విరామం ఇచ్చి ట్రీట్మెంట్ పై దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల జరిగిన ప్రభుత్వ సమీక్షలు, ప్రజా కార్యక్రమాలు, అధికారులతో సమావేశాల్లో పవన్ కళ్యాణ్ నిరంతరం పాల్గొన్నారు. భుజాల నొప్పి ఇబ్బంది పెడుతున్నప్పటికీ విధుల నిర్వహణలో ఎలాంటి తగ్గుదల చూపలేదని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అయితే డాక్టర్లు ఇక లేట్ చేయొద్దని స్పష్టం చేయడంతో సర్జరీకి వెళ్లాలని ఆయన నిర్ణయించుకున్నట్లు సమాచారం. దీంతో రాబోయే కొన్ని వారాల పాటు ఆయన రాజకీయ కార్యక్రమాల్లో తక్కువగా కనిపించే అవకాశం ఉండొచ్చు.
సర్జరీ అనంతరం కనీసం నాలుగు వారాలు పూర్తిస్థాయిలో రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సూచించినట్లు తెలుస్తోంది. ఆరోగ్య పరిస్థితిని బట్టి భవిష్యత్ రాజకీయ కార్యక్రమాలను ఫిక్స్ చేయనున్నారని సమాచారం. గత కొన్నేళ్లుగా రాజకీయాలు, సినిమాలను సమాంతరంగా కొనసాగించిన పవన్ కళ్యాణ్‌కు నిరంతర ప్రయాణాలు, బిజీ షెడ్యూల్ శారీరకంగా ఒత్తిడిని పెంచినట్లు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా, సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఆయన తర్వాతి సినిమా ఓజీ2(OG2) అవుతుందని ఇటీవల సంకేతాలివ్వడంతో అభిమానులు అఫీషియల్ అనౌన్స్మెంట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.








