Donald Trump: సినిమా వాళ్లకు ట్రంప్ షాక్

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) అమెరికా వెలుపలి దేశాల సినీ రంగాలకు ఊహించని షాక్ ఇచ్చారు. నిత్యం వివాదాస్పద నిర్ణయాలు తీసుకునే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా సినిమా వాళ్ళ విషయంలో ఊహించని షాక్ ఇచ్చారు. అమెరికా సినిమా రంగంపై ప్రభావం చూపిస్తున్న విదేశీ సినిమాలపై ట్రంప్ సంచల నిర్ణయం తీసుకున్నారు. అమెరికన్ సినీ రంగాన్ని పునరుద్ధరించే లక్ష్యంలో భాగంగా విదేశాలలో నిర్మించిన అన్ని సినిమాలపై 100% సుంకం విధించాలని నిర్ణయించారు.
అమెరికా(America) వాణిజ్య శాఖకు ఈ మేరకు అధికారాలు ఇచ్చారు. త్వరలోనే ఈ ప్రక్రియ మొదలుకానుంది. ఈ విషయాన్ని ట్రంప్ తన అధికారిక సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. గతంలో ప్రభుత్వాలు అలాగే అక్కడున్న అమెరికన్ స్టూడియోలు.. విదేశీ చిత్ర నిర్మాతలను ఆకర్షించడానికి లాభదాయకమైన ప్రోత్సాహకాలను అందిస్తున్నాయని ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని ఆర్థిక జాతీయ, భద్రత ముప్పుగా అభివర్ణించారు. అమెరికన్ సినిమా పరిశ్రమ చాలా వేగంగా మరణానికి దగ్గరవుతోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక దీనిపై సినీ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా తర్వాత అక్కడ సినిమా పరిశ్రమ ఇంకా కోలుకోలేదు. ఒకవేళ ట్రంప్ నిర్ణయం అమలు అయితే మాత్రం విదేశాల్లో కూడా హాలీవుడ్ సినిమాలకు కష్టాలు తప్పవు. ఇక డిస్నీ, పారామౌంట్, అమౌంట్ వార్నర్ బ్రదర్స్ వంటి ప్రధాన స్టూడియో లకు కచ్చితంగా ఇది ఎదురు దెబ్బగానే చెప్పుకోవచ్చు. మన దేశ సినిమాలు అమెరికాలో రిలీజ్ రావటం కూడా ఇక కష్టమే అనేది ప్రధానంగా వినపడుతున్న మాట. ఓవర్సీస్ వసూళ్ళపై మన సినిమా నిర్మాతలు ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు.