Casting Couch: చిరంజీవి Vs చిన్మయి : కాస్టింగ్ కౌచ్‌పై మళ్లీ రాజుకున్న వివాదం
సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది దశాబ్దాలుగా వినిపిస్తున్న ఒక చేదు నిజం. గ్లామర్ ప్రపంచంలో వెలుగుల వెనుక ఉన్న చీకటి కోణాన్ని తాజాగా మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు, దానికి గాయని చిన్మయి ఇచ్చిన కౌంటర్ మరోసారి చర్చకు దారితీశాయి. మన శంకర వరప్రసాద్ గారు సినిమా సక్సెస్ ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి కాస్టింగ్ కౌచ్ పై మాట్లాడారు. “సినిమా పరిశ్రమ అద్దం లాంటిదని, మనం నిబద్ధతతో ఉంటే అది కూడా మనకు గౌరవన్నే ఇస్తుందని” పేర్కొన్నారు. అలాగే పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ అనే సంస్కృతి వ్యవస్థాగతంగా లేదని, అన్నీ మన వ్యక్తిగత ప్రవర్తనపైనే ఆధారపడి ఉంటాయని అభిప్రాయపడ్డారు.
ఈ వ్యాఖ్యలపై గాయని చిన్మయి శ్రీపాద సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా స్పందించారు. ఇండస్ట్రీలో కమిట్మెంట్ అనే పదానికి అర్థం మారిపోయిందని, అది వృత్తిపరమైన నిబద్ధత కాకుండా శారీరక లొంగుబాటుగా మారిందని ఆమె ఆరోపించారు. చిరంజీవి గారి తరం వేరని, అప్పట్లో నటీనటుల మధ్య గౌరవప్రదమైన సంబంధాలు ఉండేవని, కానీ ఇప్పుడు పరిస్థితి దారుణంగా ఉందని అన్నారు. ఒక మ్యూజిక్ స్టూడియోలో మహిళా సంగీతకారిణి తనను తాను గదిలో లాక్ చేసుకున్న సంఘటనను, మరో గాయకుడు అసభ్యకరమైన ఫొటోలు పంపి వేధించిన ఉదాహరణలను ఆమె తన పోస్ట్‌లో ప్రస్తావించారు.
సినిమా రంగంలో అవకాశాల కోసం లైంగిక కోరికలు తీర్చాలనే డిమాండ్‌ను ‘కాస్టింగ్ కౌచ్’గా పిలుస్తారు. ఇది కేవలం టాలీవుడ్‌కే పరిమితం కాదు, హాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు అన్ని చోట్లా ఉంది. గతంలో అనేకమంది ఈ అంశంపై నోరు విప్పారు. 2018లో శ్రీరెడ్డి చేపట్టిన నిరసన తెలుగు రాష్ట్రాల్లో కాస్టింగ్ కౌచ్‌పై పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ఫిల్మ్ చాంబర్ ముందు ఆమె చేసిన నిరసన జాతీయ స్థాయిలో హెడ్ లైన్స్ అయ్యింది. అగ్ర నిర్మాత కుమారుడిపై కూడా ఆమె ఆరోపణలు చేశారు. 2018లో ఇండియాలో మీటూ ఉద్యమం ఊపందుకున్నప్పుడు పలువురు నటీమణులు తమకు ఎదురైన వేధింపుల గురించి బహిరంగంగా మాట్లాడారు. చిన్మయి కూడా అప్పుడే గీత రచయిత వైరముత్తుపై ఆరోపణలు చేశారు. మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న వేధింపులపై జస్టిస్ హేమ కమిటీ ఇచ్చిన నివేదిక ఇండస్ట్రీలోని పవర్ గ్రూప్స్ గుట్టును రట్టు చేసింది.
కాస్టింగ్ కౌచ్ పై ఇండస్ట్రీలోని పెద్దలు ఎక్కువగా మౌనం వహించడం లేదా “ఇదంతా వ్యక్తిగత ఇష్టం” అని కొట్టిపారేయడంపై విమర్శలు ఉన్నాయి. వేధింపులపై గొంతు ఎత్తితే తమకు వచ్చే అవకాశాలు పోతాయని, ఇండస్ట్రీ నుంచి బహిష్కరణకు గురవుతామనే భయం నటీమణుల్లో ఉంటుంది. కార్పొరేట్ సంస్థల్లో ఉన్నట్లుగా ఫిర్యాదు చేసేందుకు పటిష్టమైన ‘Internal Complaints Committees’ (ICC) ఇండస్ట్రీలో సరిగ్గా అమలు కావడం లేదని హక్కుల కార్యకర్తలు వాదిస్తున్నారు.
సినిమా రంగంలో ప్రవేశించే కొత్త వారికి ప్రతిభే ప్రాతిపదిక కావాలి తప్ప, వారి శారీరక లొంగుబాటు కాకూడదు. చిరంజీవి వంటి అగ్ర నాయకులు ఇండస్ట్రీ గౌరవాన్ని కాపాడాలని కోరుకుంటుంటే, చిన్మయి వంటి వారు క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలను ఎత్తిచూపుతున్నారు. ఈ రెండింటి మధ్య ఉన్న అంతరాన్ని పూడ్చి, మహిళా కళాకారిణులకు సురక్షితమైన పని వాతావరణం కల్పించడమే ఇండస్ట్రీ ముందున్న అసలైన సవాల్.






