Santosh Rao : ఫోన్ ట్యాపింగ్ మిస్టరీ… సంతోష్ తర్వాత ఎవరు?
తెలంగాణ రాజకీయ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఫోన్ ట్యాపింగ్ కేసు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాస గడప తొక్కింది. అధికారుల నుంచి మంత్రుల దాకా సాగిన సిట్ విచారణ, ఇప్పుడు కేసీఆర్ కు అత్యంత ఆప్తుడు, ఆయన నీడగా పేరుగాంచిన మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ రావు వద్దకు చేరింది. సంతోష్ రావును విచారించడం అంటే.. నేరుగా కేసీఆర్ అంతరంగంలోకి తొంగి చూడటమేనని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో సంతోష్ రావు పేరు వినపడని రోజంటూ లేదు. అధికారికంగా ఆయన ఎంపీ అయినప్పటికీ, అనధికారికంగా ఆయన సూపర్ పవర్ గా ఉండేవారు. కేసీఆర్ భద్రత నుంచి ఆయన వ్యక్తిగత వ్యవహారాల వరకు అన్నీ సంతోష్ రావే పర్యవేక్షించేవారు.
ఇంటెలిజెన్స్ అధికారులకు, ముఖ్యమంత్రికి మధ్య సంతోష్ రావు ఒక వారధిలా ఉండేవారని ప్రచారం ఉంది. అధికారుల నుంచి వచ్చే డేటాను ఫిల్టర్ చేసి, కేసీఆర్ కు ఏది వినిపించాలి, ఏది చూపించాలి అనే విషయంలో ఆయనదే నిర్ణయమని చెబుతుంటారు. ట్యాప్ చేసిన ఆడియో రికార్డింగ్‌లను నేరుగా ప్రగతి భవన్‌కు పంపేవారని, అక్కడ సంతోష్ రావు సమక్షంలోనే కేసీఆర్ ఆ సంభాషణలు వినేవారని దర్యాప్తు సంస్థల వద్ద కీలక సమాచారం ఉన్నట్లు తెలుస్తోంది.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంతోష్ రావు పాత్రపై నిగ్గు తేల్చేందుకు సిట్ అధికారులు స్కెచ్ వేశారు. ప్రతిపక్ష నేతలు, సొంత పార్టీ అసమ్మతి నేతలు, జర్నలిస్టుల ఫోన్ నంబర్లను ట్యాప్ చేయమని అధికారులకు ఆదేశాలు ఎక్కడి నుంచి వెళ్ళాయి? ఆ నంబర్ల స్లిప్పులను సంతోష్ రావే స్వయంగా అధికారులకు అందించారా? ఎస్ఐబీ (SIB) కార్యాలయంలో నడిచిన సమాంతర గూఢచారి వ్యవస్థకు నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇజ్రాయెల్ నుంచి సాఫ్ట్వేర్ కొనుగోలు వ్యవహారంలో సంతోష్ రావు ప్రమేయం ఎంత? ప్రభుత్వం మారబోతోందని తెలిసిన వెంటనే కంప్యూటర్ హార్డ్ డిస్క్‌లను పగులగొట్టి, డేటాను మాయం చేయమని అధికారులను ఆదేశించింది ఎవరు? ఆ సమయంలో సంతోష్ రావు ఎవరెవరితో సంప్రదింపులు జరిపారు? లాంటి అంశాలను రాబట్టేందుకు సిట్ ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.
(adsbygoogle = window.adsbygoogle || []).push({});
సంతోష్ రావును పిలవడంతోనే తెలంగాణ రాజకీయాల్లో హైడ్రామా మొదలైంది. ఆయన ఇచ్చే వాంగ్మూలం ఆధారంగానే తదుపరి చర్యలు ఉంటాయని సిట్ వర్గాలు అంటున్నాయి. లిక్కర్ స్కామ్ సమయంలో కూడా సంతోష్ రావు తన ప్రభావం చూపినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ లో కూడా కవితకు సంబంధించిన కీలక సమాచారం సంతోష్ వద్దే ఉంటుందని భావిస్తున్నారు. ఒకవేళ సంతోష్ రావు ‘నేను కేసీఆర్ ఆదేశాల మేరకే చేశాను’ అని గానీ, లేదా అధికారుల వాంగ్మూలాల్లో కేసీఆర్ పేరు నేరుగా బయటకు వస్తే మాత్రం.. మాజీ సీఎంకు నోటీసులు ఇచ్చేందుకు ప్రభుత్వం వెనుకాడకపోవచ్చు. ఫోన్ ట్యాపంగ్ వ్యవహారంపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అధికార మదంతో అందరి బెడ్ రూమ్ సంభాషణలు విన్న పాపం ఇప్పుడు పండుతోందని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తుండగా.. ఇది కేవలం రాజకీయ కక్ష సాధింపు. సంతోష్ రావుపై ఒక్క ఆధారం కూడా లేదని బీఆర్ఎస్ వాదిస్తోంది.
సంతోష్ రావు విచారణ ఈ కేసులో క్లైమాక్స్ కు ముందు వచ్చే అతిపెద్ద మలుపు అని కొన్ని వర్గాలు భావిస్తున్నాయి. ఆయన విచారణ ముగిసిన తర్వాత వెల్లడయ్యే వివరాలు.. రాష్ట్ర రాజకీయాల్లో ఎవరి కొంప ముంచుతాయో, ఎవరికి ఊరటనిస్తాయో వేచి చూడాలి.






