India EU Partnership: ఇండియా-ఈయూ రక్షణ బంధం మరింత బలోపేతం..!
భారత్, యూరోపియన్ యూనియన్ (ఈయూ) మధ్య సాంకేతిక, రక్షణ భాగస్వామ్య ఒప్పందం ఇరు పక్షాల సంబంధాల్లో కీలక మైలురాయిగా మారిందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న రాజకీయ, భద్రతా పరిస్థితులు.. భారత్, ఈయూ దేశాలను మరింత దగ్గర చేశాయన్నారు.ఢిల్లీలోని రక్షా మంత్రాలయంలో ఈయూ ప్రతినిధి బృందంతో సమావేశమైన సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.
సంబంధాల్లో కొత్త ఉత్సాహం
భారత్, ఈయూ దేశాల మధ్య ప్రజాస్వామ్యం, ఫెడరలిజం, న్యాయపాలన వంటి విలువలే భాగస్వామ్యానికి పునాదులని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. ఆ విలువలను ప్రపంచ భద్రత, సుస్థిర వృద్ధి, సమగ్ర అభివృద్ధిగా మలచాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. సాంకేతిక, రక్షణ భాగస్వామ్య ఒప్పందం ఇరు పక్షాల మధ్య ఉన్న నమ్మకానికి నిదర్శనమన్నారు. ఆర్థికం, రక్షణ, ప్రజల మధ్య సంబంధాల్లో కొత్త ఉత్సాహం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
భారత్, ఈయూ భాగస్వామ్యం అమలులోకి వస్తే, యూరోపియన్ యూనియన్‌తో భద్రత – రక్షణ ఒప్పందం కుదుర్చుకోనున్న మూడో ఆసియా దేశంగా భారత్ నిలవనుంది. ఇప్పటికే జపాన్, దక్షిణ కొరియా ఈ తరహా ఒప్పందాలు చేసుకున్నాయి. ఈ ఒప్పందం ద్వారా సముద్ర భద్రత, సైబర్ భద్రత, ఉగ్రవాద నిరోధం, అంతరిక్ష రక్షణ సాంకేతిక రంగాల్లో రెండు పక్షాలు కలిసి పనిచేయనున్నాయి. ఇకపై యూరోపియన్ యూనియన్ భారత్‌ను కేవలం ఆయుధాల కొనుగోలు చేసే దేశంగా కాకుండా… కొన్ని రంగాల్లో సరఫరాదారుగా, వ్యూహాత్మక భాగస్వామిగా కూడా చూడనుంది. ఇది భారత రక్షణ తయారీ పరిశ్రమకు కొత్త అవకాశాలు తెచ్చిపెట్టనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
గత కొంతకాలంగా భారత్ – ఈయూ భద్రతా సంబంధాలు బలపడుతున్నాయి. 2025లో యూరోపియన్ కమిషనర్ల బృందం భారత్‌కు వచ్చి భద్రతా చర్చలు జరిపింది. అదే ఏడాది సెప్టెంబర్‌లో యూరోపియన్ రాజకీయ- భద్రతా కమిటీ తొలిసారి ఆసియాకు వచ్చి భారత్‌లో ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహించింది. డిసెంబర్ 2025లో భారత రక్షణ తయారీదారుల బృందం బ్రస్సెల్స్‌లో యూరోపియన్ అధికారులతో సమావేశమైంది. మొత్తంగా, భద్రత – రక్షణ భాగస్వామ్యం భారత్ – యూరోపియన్ యూనియన్ సంబంధాల్లో కొత్త అధ్యాయానికి నాంది పలకనుందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ప్రపంచ భద్రతలో భారత్ పాత్ర మరింత బలపడనుందని విశ్లేషకులు చెబుతున్నారు.






