Revanth Reddy: అమెరికాలో రేవంత్ నేర్చుకుంటున్న కోర్స్ ఏది?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ తర్వాత గాయబ్ అయిపోయారంటూ ప్రత్యర్థి వర్గాలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. రిపబ్లిక్ డే వేడుకల్లో కూడా ముఖ్యమంత్రి పాల్గొనకపోవడంతో ఆయన ఎక్కడున్నారు.. ఏం చేస్తున్నారనే దానిపై చాలా మంది ఆరా తీయడం మొదలు పెట్టారు. అయితే రేవంత్ రెడ్డి అమెరికాలో ఉన్నారని, ఆయన ప్రతిష్టాత్మక హార్వర్డ్ యూనివర్శిటీలో ఒక కోర్సు నేర్చుకుంటారని తెలిసింది. దీంతో ఆయన ఈ వయసులో ఏం కోర్సు నేర్చుకుంటున్నారు? ఆ కోర్సు ఎందుకు నేర్చుకుంటున్నారు..? లాంటి అంశాలపై ఆరా తీయడం మొదలైంది.
రేవంత్ రెడ్డి ప్రతిష్ఠాత్మక హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో విద్యార్థిగా మారిపోయారు. విద్యార్థుల లాగే ఆయన ల్యాప్ టాప్ బ్యాగ్ పట్టుకుని క్లాస్ రూంకు వెళ్లి పాఠాలు నెర్చుకుంటున్నారు. మసాచుసెట్స్‌లోని కెన్నడీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్ (Harvard Kennedy School)లో ఆయన ఒక ప్రత్యేక కోర్సు చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంచుకున్న కోర్సు పేరు: ‘లీడర్షిప్ ఫర్ ద 21st సెంచరీ: కేయాస్, కాన్ఫ్లిక్ట్ అండ్ కరేజ్’ (Leadership for the 21st Century: Chaos, Conflict, and Courage). దీని వ్యవధి వారం రోజులు మాత్రమే. జనవరి 25న మొదలైంది. 30వ తేదీన ముగుస్తుంది. ఇది ఒక ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. అయితే.. భారతదేశ చరిత్రలో పదవిలో ఉండగానే ఐవీ లీగ్ (Ivy League) యూనివర్సిటీలో ఇలాంటి కోర్సులో చేరిన మొదటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగా చరిత్ర సృష్టించారు.
ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తికి ఈ కోర్సు ఎలా ఉపయోగపడుతుందనే ఆసక్తి అందరిలోనూ ఉంది. ఇందులో ప్రధానంగా పలు అంశాలను బోధిస్తారు. కేవలం అధికారం ద్వారా కాకుండా, ప్రజలను ఎలా సమీకరించాలి, క్లిష్ట పరిస్థితుల్లో నిర్ణయాలు ఎలా తీసుకోవాలనే నాయకత్వ నైపుణ్యాలను నేర్పిస్తారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఎదురైన రాజకీయ, సామాజిక సమస్యలు, చారిత్రక సంక్షోభాలను ఉదాహరణలుగా తీసుకుని వాటిని ఎలా పరిష్కరించాలో విశ్లేషిస్తారు. ఇక్కడ సీఎం ఒక సాధారణ విద్యార్థిలాగే ఇతర దేశాల ప్రతినిధులతో కలిసి గ్రూప్ డిస్కషన్లలో పాల్గొంటారు, అసైన్మెంట్లు పూర్తి చేస్తారు, చివరగా హోమ్‌వర్క్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వ్యవస్థల్లో వచ్చే ఆకస్మిక మార్పులు (Chaos), సంఘర్షణలను (Conflict) ధైర్యంతో (Courage) ఎలా ఎదుర్కోవాలో ఈ కోర్సు వివరిస్తుంది.
ఈ కోర్సు ఎవరైనా నేర్చుకోవచ్చా అని చాలా మంది అనుకుంటూ ఉండొచ్చు. అయితే అలా కుదరదు. ఈ కోర్సు చదవాలంటే కచ్చితంగా ఉన్నత స్థాయిలో పని చేస్తున్న వారై ఉండాలి. వివిధ దేశాల రాజకీయ నాయకులు, మంత్రులు., సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు లేదా ప్రభుత్వ సలహాదారులు., అంతర్జాతీయ సంస్థల (NGOs) ప్రతినిధులు., కార్పొరేట్ రంగంలోని టాప్ ఎగ్జిక్యూటివ్స్.. తదితరులకు ఈ కోర్సులో ప్రవేశం కల్పిస్తారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి పాల్గొంటున్న బ్యాచ్ లో 5 ఖండాల నుంచి 20 దేశాలకు పైగా ప్రతినిధులు పాల్గొంటున్నారు.
గతంలో ఎంతో మంది ప్రముఖులు ఈ యూనివర్సిటీలో చదువుకున్నారు. హార్వర్డ్ కెన్నడీ స్కూల్ ప్రపంచ ప్రసిద్ధ నేతలకు నిలయం. గతంలో ఇక్కడ డిగ్రీలు లేదా వివిధ కోర్సులు చేసిన వారిలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. తదితరులు ఉన్నారు. అనేక దేశాల అధ్యక్షులు, ప్రధానులు ఇక్కడ శిక్షణ పొందారు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కోర్సు పూర్తి చేసిన తర్వాత హార్వర్డ్ నుండి అధికారిక సర్టిఫికేట్ అందుకోనున్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో ఆయన తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు.






