Venkatesh: 65 ఏళ్ల వయసులో వెంకటేష్ రేంజ్ మామూలుగా లేదుగా.. త్రివిక్రమ్ సినిమా కోసం భారీ రెమ్యునరేషన్!
హైదరాబాద్: టాలీవుడ్ విక్టరీ స్టార్ వెంకటేష్ ప్రస్తుతం ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. వయసు పెరుగుతున్నా కొద్దీ తన బాక్సాఫీస్ స్టామినాను మరింత పెంచుకుంటూ వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. గత ఏడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఆయన, ఈ ఏడాది సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవితో కలిసి ‘మన శంకర వరప్రసాద్’ మూవీలో మెరిసి మరో సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకున్నారు.
ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ‘ఆదర్శ కుటుంబం’ అనే చిత్రంలో వెంకటేష్ నటిస్తున్నారు. గతంలో ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ వంటి క్లాసిక్ సినిమాలకు త్రివిక్రమ్ అందించిన డైలాగ్స్ వెంకటేష్ కెరీర్లోనే మైలురాళ్లుగా నిలిచాయి. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో పూర్తిస్థాయి సినిమా వస్తుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం వెంకటేష్ తన రెమ్యునరేషన్‌ను భారీగా పెంచినట్లు సమాచారం. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా దాదాపు రూ. 300 కోట్ల వసూళ్లు రాబట్టడంతో, తాజా చిత్రం కోసం ఆయన సుమారు రూ. 40 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు టాలీవుడ్ టాక్. దాదాపు రూ. 150 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం’ సినిమాతో రూ. 400 కోట్ల క్లబ్లో చేరాలని చిత్ర యూనిట్ లక్ష్యంగా పెట్టుకుంది. 65 ఏళ్ల వయసులోనూ ఒక సీనియర్ హీరో ఈ స్థాయిలో రెమ్యునరేషన్ అందుకోవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.






