Chinmayi: చిరంజీవి వర్సెస్ చిన్మయి.. క్యాస్టింగ్ కౌచ్‌పై మెగాస్టార్ వ్యాఖ్యలకు సింగర్ ఘాటు కౌంటర్!
Chinmayi: సినిమా పరిశ్రమలో ఉన్న క్యాస్టింగ్ కౌచ్ (Casting Couch) సమస్యపై మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి గాయని చిన్మయి శ్రీపాద సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలను పంచుకున్నారు. సినిమా ఇండస్ట్రీ అద్దం లాంటిదని, ఇక్కడ అంతా పారదర్శకంగా ఉంటుందని ఓ సక్సెస్ మీట్ లో పేర్కొన్నారు. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని చిన్మయి అన్నారు. ఇటీవల ఒక సక్సెస్ మీట్లో చిరంజీవి మాట్లాడుతూ, పరిశ్రమలో కొత్త టాలెంట్‌కు ఎప్పుడూ ప్రోత్సాహం ఉంటుందని చెప్పారు. “నువ్వు నిక్కచ్చిగా ఉంటే ఎవరూ నీ నుంచి అదనంగా ఏమీ ఆశించరు. క్యాస్టింగ్ కౌచ్ లాంటివి ఇక్కడ ఉండవు. ప్రొఫెషనల్ గా ఉంటే అంతా బాగుంటుంది” అని ఆయన అభిప్రాయపడ్డారు. పరిశ్రమను నెగెటివ్‌గా చూడటం సరికాదని ఆయన సూచించారు.
చిన్మయి ఏమందంటే..
చిరంజీవి వ్యాఖ్యలపై స్పందిస్తూ చిన్మయి ఎక్స్ వేదికగా ఘాటుగా స్పందించారు. సాధారణంగా కమిట్మెంట్ అంటే వృత్తి పట్ల ఉండే గౌరవం అని అర్థం. కానీ ఇండస్ట్రీలో కొందరు పురుషులు దీనిని మహిళల నుంచి లైంగిక సుఖాన్ని ఆశించే కోడ్ వర్డ్‌గా వాడుతున్నారని ఆమె ఆరోపించారు. తన తల్లి ముందే ఒక ప్రముఖ వ్యక్తి తనతో తప్పుగా ప్రవర్తించాడని, తాను కూడా వేధింపులకు గురయ్యానని చిన్మయి వెల్లడించారు. వేధింపులు భరించలేక ఎంతో మంది టాలెంటెడ్ సింగర్లు, నటీమణులు ఈ రంగాన్ని వదిలి వెళ్లిపోయారని ఆమె పేర్కొన్నారు. అదే సమయంలో చిరంజీవిపై తనకున్న గౌరవాన్ని కూడా చిన్మయి వ్యక్తం చేశారు. చిరంజీవి ఒక లెజెండ్ అని, ఆయన కాలంలో నటీనటుల మధ్య ఎంతో గౌరవం, స్నేహభావం ఉండేదని ఆమె కొనియాడారు. అయితే, ఇప్పటి పరిస్థితులు దానికి భిన్నంగా ఉన్నాయని ఆమె అభిప్రాయపడ్డారు.






