Ranabaali: విజయ్ దేవరకొండ “రణబాలి” టైటిల్ గ్లింప్స్
విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో టీ సిరీస్ సమర్పణలో ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న క్రేజీ మూవీకి “రణబాలి” అనే టైటిల్ ను ఖరారు చేశారు. టైటిల్ గ్లింప్స్ విడుదలతో పాటు సినిమా రిలీజ్ డేట్ ను కూడా అనౌన్స్ చేశారు. ఈ సినిమా సెప్టెంబర్ 11న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ కు రాబోతోంది. “రణబాలి” సినిమాను ప్రొడ్యూసర్స్ నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
ఈ సినిమా గ్లింప్స్ లో రణబాలి అనే యోధుడి పాత్రలో విజయ్ దేవరకొండ కనిపించిన తీరు ఆకట్టుకుంటోంది. తన మాతృభూమి కోసం ప్రాణాలు ఒడ్డి పోరాడే రణబాలి పాత్రలో విజయ్ ఒదిగిపోయారు. హీరోయిన్ రశ్మిక మందన్న జయమ్మగా కనిపించింది. ప్రతినాయకుడు సర్ థియోడోర్ హెక్టార్ పాత్రలో ‘మమ్మీ’ సినిమా ఫేమ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ నటించారు. పచ్చటి పైరులతో అలరారే మన గ్రామసీమలను బ్రిటీష్ క్రూర పాలకులు కరువు ప్రాంతాలుగా ఎలా మార్చారో ఈ గ్లింప్స్ లో బాధాకరంగా చూపించారు. ఆర్థికంగా పీల్చిపిప్పి చేస్తూ మన సమాజంలో హిట్లర్ ఊచకోతను మించిన మారణహోమాన్ని బ్రిటీషర్స్ ఎలా సృష్టించారో గ్లింప్స్ రిఫ్లెక్ట్ చేసింది. బ్రిటీష్ అధికారిని గుర్రానికి కట్టి రైల్వే ట్రాక్ పై రణబాలి ఈడ్చుకుంటూ వెళ్లే సీన్ గ్లింప్స్ కు హైలైట్ గా నిలుస్తోంది.
19వ సెంచరీ నేపథ్యంతో 1854 నుంచి 1878 మధ్య బ్రిటీష్ పాలనా కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా “రణబాలి” సినిమా రూపొందుతోంది. ‘డియర్ కామ్రేడ్’, ‘ఖుషి’ వంటి సక్సెస్ ఫుల్ సినిమాల తర్వాత మైత్రీ మూవీ మేకర్స్, విజయ్ కలిసి చేస్తున్న మూడో చిత్రమిది. ‘టాక్సీవాలా’ లాంటి సూపర్ హిట్ తర్వాత విజయ్ దేవరకొండ, రాహుల్ సంకృత్యన్ ఈ సినిమాతో మరోసారి కలిసి పనిచేస్తున్నారు. ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ తర్వాత “రణబాలి”లో మూడోసారి రశ్మిక, విజయ్ జంటగా నటించారు.






