Chandrahas: యాటిట్యూడ్ స్టార్ కాదు.. అరాచక స్టార్!
సినిమా అంటే ఒక కళ.. నటన అంటే ఒక సంస్కారం. కానీ ఈ మధ్య కొందరు కొత్త నటులు యాటిట్యూడ్ అనే ముసుగులో అహంకారాన్ని ప్రదర్శిస్తూ, సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారో కూడా తెలియడం లేదు. తన వింత చేష్టలతో యాటిట్యూడ్ స్టార్ అనిపించుకున్న చంద్రహాస్.. ఇప్పుడు ఏకంగా బూతు పురాణానికి తెరలేపారు. ‘బరాబర్ ప్రేమిస్తా’ అంటూ వస్తున్న ఈ కుర్ర హీరో, ఒక ప్రీ-రిలీజ్ ఈవెంట్ సాక్షిగా అసభ్య పదజాలంతో పాట పాడి సభ్య సమాజం తలదించుకునేలా చేశారు.
ఇప్పుడు టాలీవుడ్లో ఎక్కడ చూసినా చంద్రహాస్ పేరు మారుమోగిపోతోంది. కానీ అది తన నటన వల్ల కాదు.. తను చేసిన వెకిలి చేష్టల వల్ల! ‘బరాబర్ ప్రేమిస్తా’ సినిమా ప్రమోషన్లలో భాగంగా వేదికపై చంద్రహాస్ పాడిన పాట ఇప్పుడు పెద్ద దుమారాన్నే రేపింది. సినిమాలో తన క్యారెక్టర్ గురించి చెప్తున్నానని అంటూనే.. నోటికొచ్చినట్లు అసభ్య పదజాలంతో చెలరేగిపోయాడు. కుటుంబ సభ్యులు, సినీ పెద్దలు ఉన్న వేదికపై అంతటి బూతు పాట పాడుతుంటే, నాగరిక సమాజం విస్తుపోయింది.
విమర్శలు వస్తే తప్పు తెలుసుకోవాలి.. కానీ చంద్రహాస్ తీరు అందుకు భిన్నం! తప్పును ఎత్తి చూపిన జర్నలిస్టుపై ఏకంగా బెదిరింపులకు దిగడం ఇతడి అహంకారానికి పరాకాష్ట. “క్షమాపణ చెప్పను.. ఏం చేసుకుంటారో చేసుకోండి” అంటూ జర్నలిస్టుపై విరుచుకుపడటమే కాకుండా, చట్టపరమైన చర్యలు తీసుకుంటానని రివర్స్ అటాక్ చేయడం చూస్తుంటే.. ఇతడి ‘యాటిట్యూడ్’ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు పోలీసు కేసు నమోదైంది. చట్టం తన పని తాను చేసుకుపోతోంది.
మరోవైపు దర్శక నిర్మాతలు ఇప్పుడు నాలుక కరుచుకుంటున్నారు. “అతడు కావాలని చేయలేదు.. ఆ సమయంలో మాకు అర్థం కాలేదు” అంటూ కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు నిర్మాత చిన్ని. దర్శకుడు సంపత్ రుద్ర కూడా చంద్రహాస్ తీరుపై విచారం వ్యక్తం చేశారు. ఇక వేదికపై ఉన్న సీనియర్ నటుడు జేడీ చక్రవర్తి కూడా తాను ఆ ఈవెంట్లో ఉండాల్సింది కాదని బహిరంగంగానే పశ్చాత్తాపపడ్డారు. మహిళలను కించపరిచేలా, అసభ్యంగా ప్రమోషన్లు చేయడం తప్పు అని ఆయన గట్టిగానే చెంపదెబ్బ కొట్టారు.
అసలు చంద్రహాస్ గతాన్ని చూస్తే.. ఇప్పటివరకు చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బొక్కబోర్లా పడ్డాయి. హిట్ లేదు సరికదా.. కనీసం గుర్తింపు కూడా లేదు. అందుకే ఇలాంటి చీప్ ట్రిక్స్ ద్వారా, బూతుల ద్వారా వార్తల్లో నిలవాలని చూస్తున్నారా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. యాటిట్యూడ్ అనేది నటనలో ఉండాలి.. వ్యక్తిత్వంలో వినయం ఉండాలి. కానీ ఇక్కడ మాత్రం అంతా రివర్స్! కొడుకు తప్పు చేస్తుంటే తండ్రి వారించాల్సింది పోయి.. సమర్థిస్తున్నట్లు ఉండటం చూస్తుంటే, అసలు ఈ సంస్కృతి ఎటు పోతుందో అర్థం కావడం లేదు.
బూతులు తిడితే హైలైట్ అవ్వొచ్చేమో కానీ, హీరోలు కాలేరు! ప్రేక్షకులు సినిమాను ఆదరించాలంటే కంటెంట్ ఉండాలి కానీ.. ఇలాంటి ‘కంపు’ ఉండకూడదు. ఇప్పటికైనా చేసిన తప్పు తెలుసుకుని క్షమాపణ చెప్తారో.. లేక ఈ అహంకారంతోనే కెరీర్ ను నాశనం చేసుకుంటారో చూడాలి. ఫిబ్రవరి 6న వస్తున్న ‘బరాబర్ ప్రేమిస్తా’ ఫలితం ఎలా ఉంటుందో ప్రజలే తేలుస్తారు.






