NZ-India: న్యూజిలాండ్ తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం… మరింత పెరగనున్న ఆర్థిక బంధం…!
భారత్ -న్యూజిలాండ్ మధ్య చారిత్రాత్మక స్వేచ్ఛావాణిజ్య ఒప్పందం ఖరారైంది. మార్చిలో న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్షన్ భారత పర్యటనలో దీన్ని ప్రస్తావించారు. 9 నెలల సమయంలోనే ఈ ఒప్పందం జరిగింది.ప్రధాని మోడీ సోమవారం న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్తో టెలిఫోన్లో సంభాషించారు. అనంతరం చారిత్రాత్మక, ప్రతిష్టాత్మకమైన పరస్పర ప్రయోజనకరమైన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం విజయవంతంగా జరిగిందని సంయుక్తంగా ప్రకటించారు.ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడడం కోసం ఇది ఎంతగానో దోహదపడుతుందని ఇరువురి నాయకులు చెప్పారు.
ప్రధానుల హర్షం.. మంత్రి అసంతృప్తి
న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ ఈ ఒప్పందాన్ని సమర్థించారు. భారత్ లాంటి వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థతో జతకట్టడం వల్ల తమ దేశానికి భారీగా ఉద్యోగాలు, వృద్ధి వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అటు భారత ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ ఒప్పందాన్ని ఒక ‘చారిత్రాత్మక మైలురాయి’గా అభివర్ణించారు. కేవలం 9 నెలల్లోనే ఈ చర్చలు ముగియడం విశేషమని, రాబోయే ఐదేళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యం రెట్టింపు అవుతుందని మోడీ పేర్కొన్నారు.
రాబోయే 15 ఏళ్లలో న్యూజిలాండ్ నుంచి భారతదేశంలో 20 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. విద్యార్థులు, యువతకు కొత్త అవకాశాలు కూడా రానున్నాయి. ఫోన్ సంభాషణ తర్వాత న్యూజిలాండ్ ప్రధాని లక్సన్ ఎక్స్‌లో కీలక పోస్ట్ పెట్టారు. భారతదేశంతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు ముగిశాయని పేర్కొన్నారు.
అయితే.. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA)పై న్యూజిలాండ్ ప్రభుత్వంలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆ దేశ విదేశాంగ మంత్రి విన్స్టన్ పీటర్స్ ఈ ఒప్పందాన్ని తీవ్రంగా విమర్శిస్తూ ఇది ‘స్వేచ్ఛాయుతమైనది కాదు.. నిష్పాక్షికమైనది అసలే కాదు’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది న్యూజిలాండ్‌కు తీవ్ర నష్టం చేకూర్చే ‘బ్యాడ్ డీల్’ అని ఆయన అభివర్ణించారు.
న్యూజిలాండ్ ఫస్ట్ పార్టీ అధినేతగా, సంకీర్ణ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్న పీటర్స్ ఈ ఒప్పందంపై ఎక్స్ వేదికగా తన అసహనాన్ని వ్యక్తం చేశారు. న్యూజిలాండ్ ప్రధాన ఎగుమతి రంగమైన డెయిరీ (పాలు, వెన్న, చీజ్) ఉత్పత్తులపై భారత్ ఎటువంటి సుంకాలు తగ్గించలేదని, దీనివల్ల తమ రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తంచేశారు. డైరీ ఉత్పత్తులు లేని మొదటి వాణిజ్య ఒప్పందం ఇదేనని మండిపడ్డారు. ఈ ఒప్పందం ద్వారా భారతీయ కార్మికులు, విద్యార్థుల వలసలకు న్యూజిలాండ్ భారీగా రాయితీలు ఇచ్చిందని, ఇది తమ దేశ నిరుద్యోగులపై ప్రభావం చూపుతుందని ఆయన హెచ్చరించారు.






