అల్లర్ల తర్వాత అమెరికా క్యాపిటల్ కొత్త పోలీస్ అధిపతిగా యోగానంద పిట్మన్
క్యాపిటల్ కొత్త పోలీస్ అధిపతిగా ఒక నల్లజాతి మహిళను క్యాపిటల్ పోలీస్ శాఖ నియమించింది. గత వారం క్యాపిటల్ వద్ద ట్రంప్ మద్దతుదారులు హింసా విధ్వంసకాండలకు పాల్పడినప్పుడు క్యాపిటల్ పోలీస్ శాఖ తగినంతగా స్పందించకపోయిన ఫలితంగా ఇదివరకటి పోలీస్ అధిపతి రాజీనామా చేయడంతో ఆమెను కొత్త పోలీస్ అధిపతిగా నియమించారు.
మోర్గాన్ స్టేట్ యూనివర్సిటీ తెలిపిన వివరాల ప్రకారం, ఇదివరకు సహాయ అధిపతిగా పనిచేసిన యోగానంద పిట్మన్ ఈ పదవిని చేపట్టిన మొట్టమొదటి మహిళ. అంతేకాదు, ఒక నల్లజాతీయురాలు ఈ పదవిని చేపట్టడం కూడా ఇదే మొదటిసారి. నల్లజాతివారి యూనివర్సిటీగా ప్రసిద్ధి చెందిన ఈ యూనివర్సిటీ నుంచి ఆమె 1999లో తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. క్యాపిటల్‌లోని పోలీస్ శాఖతో మాట్లాడడానికి సి.ఎన్.ఎన్ ప్రయత్నించింది కానీ, ఈ వార్తను ఎవరూ ధ్రువీకరించలేదు.
స్టీవన్ సండ్ స్థానంలో పిట్మన్ నియమితులయ్యారు. క్యాపిటల్ హిల్ మీద గత వారం విధ్వంస మూకలు దాడి చేసినప్పుడు, ఆశించిన స్థాయిలో స్పందించలేదనే ఆరోపణలు, విమర్శలు రావడంతో ఆయన రాజీనామా చేశారు.
”కొత్త పోలీస్ అధిపతి పిట్మన్ ప్రగతిశీల భావాలు కలిగిన అధిపతి” అని గత సోమవారం సండ్ సి.ఎన్.ఎన్తో అన్నారు. ”అధికారుల సంక్షేమం పట్ల కూడా ఎంతో శ్రద్ధాసక్తులు కలిగిన వ్యక్తి ఆమె” అని ఆయన వ్యాఖ్యానించారు.
పోలీసులు ద్వంద్వ ప్రమాణాలు పాటించారంటూ నల్లజాతి ఉద్యమకర్తలు, పౌర హక్కుల ఉద్యమకారులు విమర్శించడంతో పోలీసుల పనితీరుపై అందరూ దృష్టి సారించారు. గత వేసవిలో ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్స్’ ఉద్యమకారుల విషయంలో పోలీసులు వెనువెంటనే స్పందించి బాష్పవాయువు, రబ్బర్ బులెట్లను ప్రయోగించారని, క్యాపిటల్ హిల్‌పై దాడి చేసిన ట్రంప్ మద్దతుదార్లలో ఎక్కువ మంది శ్వేత జాతీయులు కావడంతో చూసీ చూడనట్టు వదిలేశారని వారు ఆరోపించారు.
క్యాపిటల్ హిల్ గేట్ల గుండా పోలీసులు అల్లరి మూకలను అనుమతించడం, వారిని వెంటబెట్టుకుని మెట్ల వరకూ తీసుకు వెళ్లడం, వారితో సెల్ఫీలు దిగడం వగైరాలకు సంబంధించిన ఫోటోలు నల్లజాతీయులలో ఆగ్రవేశాలు పెల్లుబుకడానికి కారణమయ్యాయి. ఒక పోలీస్ అధికారితో సహా అయిదు మంది అల్లరి మూకల దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు.
క్యాపిటల్ ఉదంతం క్యాపిటల్ పోలీసుల వైఫల్యం కాదని అమెరికా క్యాపిటల్ మాజీ అధిపతి టెరెన్స్ గైనర్ వ్యాఖ్యానించారు. గైనర్ గత వారం సి.ఎన్.ఎన్‌కు చెందిన న్యూడేతో మాట్లాడుతూ, విధ్వంసకారుల సంఖ్య కంటే పోలీసుల సంఖ్య తక్కువగా ఉందని, వారు తమ శక్తిని తక్కువగా అంచనా వేశారని, మూకలను అదుపు చేయగలమని మితిమీరిన ఆత్మవిశ్వాసంతో వ్యవహరించారని ఆయన పేర్కొన్నారు.
”క్యాపిటల్ హిల్ భవనం తలుపులు, కిటికీల దగ్గరికి ఎవరూ వెళ్లలేరు” అని గైనర్ అంటూ, దీని మీద క్షుణ్ణంగా దర్యాప్తు జరగాలని సూచించారు.
పోలీస్ శాఖలో ఒక నల్లజాతీయురాలిగా పిట్మన్ తనకంటూ ఒక చరిత్ర సృష్టించుకున్నారు. క్యాపిటల్ పోలీస్ శాఖ వెబ్సైట్ ప్రకారం, 2001 ఏప్రిల్‌లో పోలీస్ శాఖలో చేరిన పిట్మన్ కెప్టెన్ ర్యాంక్ సాధించిన మొట్టమొదటి నల్లజాతి పోలీస్ సూపర్వైజర్గా పేరు తెచ్చుకున్నారు. కెప్టెన్‌గా ఆమె 400 మంది పోలీస్ అధికారులు, పౌరులకు నాయకత్వం వహించడమే కాకుండా, 2013లో జరిగిన అధ్యక్ష పదవీ ప్రమాణ స్వీకారం రోజున భద్రతా వ్యవహారాలను సమర్థవంతంగా పర్యవేక్షించారు.
అమెరికన్ సెనేటర్లకు భద్రత కల్పించడం, ఆఫీస్ ఆఫ్ ది అకౌంటబిలిటీ అండ్ ఇంప్రూవ్‌మెంట్‌లో ఇన్స్పెక్టర్గా పనిచేయడం పిట్మన్ నిర్వహించాల్సిన ఇతర విధులలో ముఖ్యమైనవి.
మోర్గాన్ స్టేట్ యూనివర్సిటీ నుంచి సైకాలజీలో బాచురల్ ఆఫ్ సైన్స్ చేసిన పిట్మన్, న్యూయార్క్‌లోని పఫ్కీప్సీలో ఉన్న మారిస్ట్ కాలేజీలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. మోర్గాన్ స్టేట్ యూనివర్సిటీ ఈ వివరాలు అందించింది. దేశంలో అతి తక్కువ మంది నల్లజాతి మహిళా పోలీస్ అధిపతుల్లో పిట్మన్ ఒకరు.
మేజర్ సిటీ చీఫ్స్ అసోసియేషన్ ప్రకారం, దేశంలో ప్రధాన నగరాలలో అయిదుగురు నల్లజాతి మహిళా పోలీస్ అధిపతులున్నారు. అందులో ఫిలడెల్ఫియా పోలీస్ కమిషనర్ డేనియల్ ఔట్లా, ఫినిక్స్ పోలీస్ అధిపతి జెరి విలియమ్స్, ర్యాలీ (నార్త్ కరోలినా) పోలీస్ అధిపతి క్యాసెండ్రా డెక్బ్రౌన్, లూయిస్విల్లీ (కెంటుకీ) మధ్యంతర పోలీస్ అధిపతి యెవెట్ జెంట్రీ, డెకాబ్ కౌంటీ (జార్జియా) పోలీస్ అధిపతి మిర్తా రమోస్ ఉన్నారు.
న్యూయార్క్ సిటీ పోలీస్ విభాగంలో గస్తీ దళం అధిపతిగా గత ఏడాది జానిటీ హోమ్స్‌ను నియమించారు. ఈ పదవిని చేపట్టిన మొట్టమొదటి నల్లజాతి మహిళ ఆమె.
నల్లజాతి పురుషులను పోలీసులు హతమార్చినందుకు, తమ నగరాల్లో నిరసన ప్రదర్శనలను నియంత్రించడంలో విఫలమైనందుకు గత ఏడాది కొందరు మహిళా పోలీస్ అధికారులపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి.
రేషర్డ్ బ్రూక్స్ అనే వ్యక్తిని పోలీసులు చంపినందుకు అట్లాంటా మాజీ పోలీస్ అధిపతి ఎరికా షీల్డ్స్ పదవి నుంచి వైదొలగారు. పోలీస్ విభాగం బడ్జెట్లో సిటీ కౌన్సిల్ 40 లక్షల డాలర్ల కోత విధించినందుకు సియాటిల్ మాజీ పోలీస్ అధిపతి కార్మన్ బెస్ట్ తాను పదవీ విరమణ చేస్తున్నట్టు ప్రకటించారు. డాలస్ మాజీ పోలీస్ అధిపతి యు. రేనీ హాల్ తాను రాజీనామా చేస్తున్నట్టు గత సెప్టెంబర్‌లో ప్రకటించారు.
పోర్ట్‌ల్యాండ్ మొదటి నల్లజాతి మహిళా పోలీస్ అధిపతిగా పని చేసిన ఔట్లా, గత ఏడాది జూన్‌లో ప్రదర్శనకారులపై పోలీసులు బాష్పవాయువును ప్రయోగించినందుకు బహిరంగంగా క్షమాపణ చెప్పారు. ఈ చర్య సమర్థనీయం కాదని ఆమె వ్యాఖ్యానించారు. అక్టోబర్‌లో ఓ పోలీస్ అధికారి చేతుల్లో మరణించిన వాల్టర్ వాలెస్ జూనియర్ కుటుంబ సభ్యుల్ని ఆమె పరామర్శించారు. అతని మరణానికి సంబంధించిన వీడియో ఫుటేజ్‌ను పరిశీలించడానికి అతని కుటుంబ సభ్యులకు అనుమతినిచ్చారు. ఆ తర్వాతే ఆ వీడియోను బయటికి విడుదల చేశారు.






